రైతాంగం కోసం చివరి వరకు పోరాటం చేస్తాం- మంత్రి జగదీష్ రెడ్డి

52
Minister jagadish reddy
- Advertisement -

పండిన పంటను కొనుగోలు చెయ్యాల్సిన బాధ్యత ముమ్మాటికి కేంద్రప్రభుత్వం మీదనే ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. అటువంటి బాధ్యతల నుండి మోడీ సర్కార్ తప్పుకోవాలని చుస్తే మెడలు వంచి మరీ కొనుగోలు జరిపిస్తామని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో పండిన పంటను కేంద్రం కొనుగోలు చేయడం లేదంటూ అందుకు వ్యతిరేకంగా మండల కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శనలు నిర్వహించాలంటూ టిఆర్‌ఎస్ చీఫ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగం ఉరువాడ ఒక్కటై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన గళం వినిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన మంత్రి జగదీష్ రెడ్డి సమన్వయంతో జిల్లాలోని టిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో మండల కార్యాలయాల ఎదుట రైతాంగం పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. అందులో భాగంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన ప్రదర్శనలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పండిన పంటను కేంద్రం కొనుగోలు చేసేంత వరకు మొదలు పెట్టిన ఈ నిరసన ప్రదర్శనలు తెలంగాణా రాష్ట్రంలో మరో ఉద్యమానికి అంకురార్పణ చుట్టబోతున్నట్లు ప్రకటించారు. రాజకీయ క్రీడలతో రైతాంగం నోట్లో మట్టి కొట్టొద్దని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వాస్తవానికి యాసంగిలో వరి వద్దని వారించిందే ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన గుర్తు చేశారు. అందుకు భిన్నంగా వరినే వెయ్యాలంటూ ప్రోత్సహించింది బిజెపి కి చెందిన నేతలు కాదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. పండిన ప్రతి గింజను కొనుగోలు చెయ్యాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆహార భద్రత చట్టం కుడా అదే చెబుతోందని ఆయన తేల్చిచెప్పారు.గడిచిన నాలుగు దశాబ్దాలుగా అదే జరుగుతోందని కొత్తగా ఏర్పడిన తెలంగాణా రాష్ట్రంలో కుడా ఇంత కాలం అదే పద్ధతిని అవలంబించింది నిజం కాదా అని ఆయన కేంద్రాన్ని నిలదీశారు.

దానిని విస్మరించి అందుకు భిన్నంగా రైతాంగంలో ఆత్మ స్థైర్యం దెబ్బ తీసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతోందంటూ ఆయన మండిపడ్డారు.ముఖ్యమంత్రి కేసీఆర్ రైతాంగంలో విశ్వసనీయత పెంచినందునే తెలంగాణా రాష్ట్ర రైతాంగం ఇప్పుడిప్పుడే అప్పుల ఉబి నుండి బయట పడుతున్నారని బాధ్యత లేకుండా కేంద్రం అనుసరిస్తున్న విధానాలతో అదే రైతాంగం గందరగోళం లో పడుతున్నారని ఆయన ఆరోపించారు. బిజెపి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఆడుతున్న డ్రామాలకు పులిస్టాఫ్ పెట్టి పంటల కొనుగోలు పై జాతీయ విధానం ప్రకటించాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ఏయో రాష్ట్రాలలో ఏ పంటను పండించాలి ….పండించిన పంటలో ఎంత మేరకు కొనుగోలు చెయ్యాలి…అన్నది ఆ ప్రణాళికల ద్వారా ముందే తెలియ పరచ గలిగితే అందుకు అనుగుణంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి రైతాంగంలో అవగాహన ను పెంపొందిస్తాయన్నారు.

అలా కాకుండా దాగుడు మూతలతో రైతాంగాన్ని దగా చెయ్యాలి అని చూస్తే మాత్రం పార్టీగా టిఆర్‌ఎస్ పార్టీ చూస్తూ ఉరుకోబోదని ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్రం మెడలు వంచి కొనుగోలు జరిపిస్తారని ఆయన హెచ్చరించారు. పండిన పంటను కొనుగోలు చేయకుంటే పర్యటనకు వస్తున్న ఆ పార్టీ నేత బండి సంజయ్ నెత్తిన పోసేందుకు రైతాంగం రెడీగా ఉన్నారంటూ ఆయన ఎద్దేవ చేశారు. రైతాంగం కోసం చివరి వరకు టిఆర్‌ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -