గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ఈరోజు మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మొక్కలు నాటారు. అనంతరం మంత్రి మరో ముగ్గురికి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు. వారిలో సీఎస్ సోమేష్ కుమార్, ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు, టీసీపీడీసీఎల్ సీఎండీ రఘరామారెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే రవీందర్ నాయక్, రాష్ట్ర బేవరేజీస్ కార్పోరేషన్ చైర్మన్ దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మొక్కలే జీవకోటికి ప్రాణాధారమని.. నేడు నాటిన మొక్కలే తర్వాత వృక్షాలై సకల జీవులకు జీవనాధారమవుతాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పచ్చదనం పెంచాలనే ఉద్ధేశంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారు. హరితహారంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా కొన్ని కోట్ల మొక్కలు నాటామని మంత్రి గుర్తు చేశారు. హరితహారం కార్యక్రమానికి కొనసాగింపుగా.. కాస్త వినూత్నంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరం అని మంత్రి అన్నారు.
ఈ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో చాలా మంది ప్రజాప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీలు, పారిశ్రామికవేత్తలు పాల్గొని కొన్ని లక్షల మొక్కలు నాటారని మంత్రి అన్నారు.ప్రముఖులే కాకుండా, రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో పాలుపంచుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు.