సూర్యాపేట మున్సిపాలిటీ అమ్ముల పొదిలో అధునాతన యంత్రం చేరింది. 8 లక్షల 50 వేలు వెచ్చించి ఈ యంత్రాన్ని సూర్యాపేట మున్సిపల్ యంత్రాంగం కొనుగోలు చేసింది. గంటకు పది నుండి 20 మీటర్ల దూరంతో వెయ్యి లీటర్లు పిచికారీ సామర్ధ్యం గల ఈ అధునాతన యంత్రాన్ని మున్సిపాలిటీ ఆవరణలో మంత్రి జగదీశ్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమం అనంతరం న్యాయవాది డపుకు మల్లయ్య స్పాన్సర్ చేసిన కోడిగ్రుడ్లను మంత్రి జగదీశ్ రెడ్డి పారిశుద్ధ్య కార్మికులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వినయ్ కృష్ణ రెడ్డి, చైర్మన్ అన్నపూర్ణ,కమీషనర్ రామనుజుల రెడ్డి, వైస్ చైర్మన్ పుట్టా కిషోర్,కౌన్సిలర్లు భరత్, దిలీప్ రెడ్డి, తాయర్ పాషా నిమ్మల స్రవంతి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. గత రెండు నెలలుగా కరోనా కట్టడిలో సూర్యాపేట మున్సిపల్ పాలక వర్గం, సిబ్బంది,అధికారులు రాజీ లేని పోరాటం చేస్తున్నారు. ఏ ఒక్కరికి నిత్యావసరాలు, మందులు,ఇతర వస్తువుల కొరత లేకుండా సకాలంలో అందించి మున్సిపల్ సిబ్బంది తమ కమిట్ మెంట్‌ను చాటుకున్నారు. అనుక్షణం సూర్యాపేట పట్టణంను వాష్ చేయడానికి అధునాతన స్ప్రే యంత్రాన్ని కొనుగోలు చేశాం. కరోనా కట్టడిలో ప్రభుత్వం చేస్తున్న పోరాటంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
లాక్ డౌన్ మినహాయింపును తేలికగా తీసుకోకుండా,అనుక్షణం పక్కన శత్రువు ఉందన్న తరహాలో ప్రజలు వ్యవహరించాలని.. అనుక్షణం అప్రమత్తతే మనకు శ్రీరామ రక్ష అన్నారు. లాక్ డౌన్ పీరియడ్ ను కేరింగ్ పీరియడ్‌గా తీసుకుని..రాబోయే రోజుల్లో కరోనా భారీన పడకుండా ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలి. నిరాశ్రయులకు ప్రభుత్వం చేస్తున్న సహాయానికి తోడుగా దాతలు, ఎన్జీవో, స్వచ్చంద సంస్తలు అందిస్తున్న సహకారం అమోఘమన్నారు.వ్యాక్సిన్ వచ్చి..ఇక భయం లేదు అన్న భరోసా లభించేంత వరకు ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.