జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి జగదీష్ రెడ్డి ఆదివారం ఎల్‌బీ నగర్ డివిజన్ పరిధిలోని మన్సూరాబాద్, హయత్ నగర్, సరూర్ నగర్, లింగోజిగూడ తదితర డివిజన్‌లలో విస్తృతంగా పర్యటించారు. ఆయా డివిజన్‌లలో అపార్ట్‌మెంట్ వాసులతో పాటు కాలనీ సంక్షేమ సంఘాలతో వ్యక్తిగత సనావేశాలు నిర్వహించారు. సరూర్ నగర్ డివిజన్ పరిధిలో టీఆర్‌ఎస్ అభ్యర్థిని అనితా దయాకర్ రెడ్డితో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. భాగ్యనగరాన్ని అభాగ్య నగరంగా మార్చేందుకే బీజేపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ సర్కార్ కూలిపోతుందంటూ బీజేపీ నేతలు అవాకులు చెవాకులు పేలుతున్నారని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం కూలిపోవడం కాదు తెలంగాణ బిడ్డలు తలుచుకుంటే ఢిల్లీ పీఠం పునాదులే కదిలి పోతాయని బీజేపీ శ్రేణులను మంత్రి మండిపడ్డారు.
హైదరాబాద్‌లో వరదలు వచ్చినప్పుడు రాని బీజేపీ నేతలు.. ఇప్పుడు ఓట్లు ఆనంగానే వరదలా వస్తున్నారని మంత్రి ఎద్దేవ చేశారు. వరద సహాయం ఇవ్వక పోవడం వల్లనే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ముఖం చూపే లేక ప్రధాని మోదీ ముఖంచాటేశారని ఆయన విమర్శించారు. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా నిర్మించడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం అన్నారు. నిర్మాణాలు మా వంతు. కూల్చి వేతలు బీజేపీ వంటూ ఆయన ఎద్దేవా చేశారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో చిచ్చుపెట్టొద్దని హితవు పలికారు. యోగిల, బోగిల మాటలను హైదరాబాద్ ప్రజలు పట్టించుకోరని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు.