వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. గుర్రంపోడులో కాలువను ప్రారంభించిన అనంతరం సభలో మాట్లాడిన జగదీశ్ రెడ్డి…కాంగ్రెస్ నేత జానారెడ్డిపై తీవ్రస్ధాయిలో మండిపడ్డారు.ఇరవై ఏండ్లుగా 7బీ డిస్టిబ్యూటరీ పూర్తి కాకపోవడానికి జానారెడ్డే కారణమన్నారు.
నాగార్జునసాగర్ నియోజకవర్గంలో మంచినీటి ఎద్దడి ఉందంటే జానారెడ్డే కారణమన్నారు. 30 ఏండ్లుగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయనకు ఇంత కాలం గుర్రంపోడు మండలానికి నీరందించే 7 బీ డిస్ట్రిబ్యూటీరి ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. రాజవరం మొదటి మేజర్ కు నీళ్లు రాకపోవడానికి కూడా ముమ్మాటికీ జానారెడ్డి యే కారణమన్నారు.
20 రోజుల్లో భూరికార్డుల ప్రక్షాళన పూర్తి చేసి తప్పులు సరిదిద్ది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాలలో దొర్లిన తప్పులు సరిదిద్దడంలో ఎవరికి పైసలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. ఈ కాలువ ద్వారా గుర్రంపోడు మండల పరిధిలోని 18 గ్రామాలకు సాగు నీరందనుంది.