తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి పాఠశాలలు పున:ప్రారంభమైన నేపథ్యంలో అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాఠశాలలను సందర్శించారు. సోమవారం నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని రాంపూర్‌లో ప్రాథమిక, అంగన్ వాడీ పాఠశాలలను, దర్యాపూర్ లోని ప్రాథమికోతన్నత పాఠశాలను పరిశీలించారు. ఇందులో భాగంగా కొంతసేపు విద్యార్థులతో ముచ్చటించారు.
తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టులలో విద్యార్ధుల ప్రావీణ్యాన్ని కూడా మంత్రి పరీక్షించారు. చిన్నారులతో ఏబీసీడీలు చెప్పించారు. రైమ్స్ పాడాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి విద్యార్థులను అభినందించారు. అలాగే పాఠశాలలో కొవిడ్ నిబంధనల అమలు తీరు, తరగతి గదుల్లో విద్యార్థుల సీటింగ్, హాజరు శాతాన్ని పరిశీలించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వంద శాతం విద్యార్థులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్ధులను మరింత మెరుగైన విద్యను అందించాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు.