భైంసా బాధితుల‌కు మంత్రి ప‌రామ‌ర్శ..

236
minister ik reddy
- Advertisement -

నిర్మ‌ల్ జిల్లా భైంసాలో ఇటీవ‌ల చోటుచేసుకున్న అల్ల‌ర్ల వెనుక ఎవ‌రున్న‌, ఎంత‌టి వారైనా స‌రే ఉపేక్షించేది లేదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఘర్షణలు చోటుచేసుకున్న మ‌హాగావ్ గ్రామంతో పాటు భైంసా ప‌ట్ట‌ణంలోని ప‌లు ప్రాంతాల్లో ప‌ర్య‌టించి, బాధితులను పరామర్శించారు. అన్నివిధాలుగా అండగా ఉంటామని అధైర్యపడవద్దని బాధిత కుటుంబాల‌కు మంత్రి భరోసా నిచ్చారు. భైంసా ప‌ట్ట‌ణంలో దుకాణాలు దగ్ధ‌మైన ప్రాంతంలో ప‌ర్య‌టించారు.

అనంత‌రం అతిధి గృహంలో మీడియా స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ.. భైంసా ప‌ట్ట‌ణం, ప్రజలను ఈ స్థితిలో చూడడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. జ‌నజీవ‌నం స్తంభించ‌డంతో కూలీ నాలీ చేసుకునే వారు ఇబ్బందులు ప‌డుతున్నారని, సామాన్య‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, చిరు వ్యాపారులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారని ఆందోళ‌న వెలిబుచ్చారు. వ‌రుస సంఘ‌ట‌న వ‌ల్ల భైంసా అభివృద్ది కుంటుప‌డుతుంద‌ని, దీని ప్ర‌భావం చుట్టుప్ర‌క్క‌ల ప్రాంతాల‌పై ప‌డుతుంద‌ని మంత్రి అల్లోల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. అల్లర్ల కారణంగా అన్నీ రకాలుగా నష్టపోయిన ప్రజలను సాధారణ స్థితికి తీసుకువచ్చే బాధ్యత మనందరిపైనా ఉందని ఆయన గుర్తుచేశారు. భవిష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా రాజ‌కీయాల‌కు అతీతంగా కృషి చేయాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపై ఉంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఇలాంటి సంఘ‌ట‌న‌లు నుంచీ రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని కొన్ని పార్టీలు చూస్తున్నాయ‌ని, ఈ అల్ల‌ర్ల వెనుక ఏ పార్టీ హ‌స్తం ఉందో అంద‌రికీ తెలుస‌న్నారు. మ‌హాగావ్‌లో టీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్య‌క‌ర్త ఆటో ద‌గ్ధం చేశార‌ని, కానీ కొత‌మంది ఈ అల్ల‌ర్ల వెనుక టీఆర్ఎస్ పార్టీ ఉంద‌నే అస‌త్య ప్ర‌చారం చేస్తున్నార‌ని, ఇటువంటి మాట‌ల‌ను స‌హించ‌బోయేది లేద‌ని హెచ్చ‌రించారు. భైంసా ఘటనపై స‌మ‌గ్ర దర్యాప్తు జ‌రుగుతుంద‌ని, దీని వెన‌క ఎవ‌రు ఉన్నారో ద‌ర్యాప్తులో తేలుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. పోలీసుల‌కు పూర్తి స్వేచ్చ‌నిచ్చామ‌ని, నిందితులు ఎవ‌రైనా స‌రే వ‌దిలిపెట్టేది లేద‌న్నారు. జ‌ర్న‌లిస్టులపై దాడి జ‌ర‌గ‌డం విచార‌క‌ర‌మ‌ని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వెంటఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, క‌లెక్ట‌ర్ ముషార‌ఫ్ అలీ, ఎస్పీ విష్ణు వారియ‌ర్, ఇత‌ర అధికారులు, స్థానిక ప్ర‌జాప్ర‌తినిదులు ఉన్నారు.

- Advertisement -