ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేపట్టిన నీటి పారుదల ప్రాజెక్టుల పనులు వేగంగా పూర్తి చేయాలని అటవీ, పర్యావరణ, న్యాయ,దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్ట్‌ల పనుల ప్రగతిపై పలువురు ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్ పర్సన్లు, జడ్పీ చైర్మన్, నీటిపారుద శాఖ ఉన్నతాధికారులతో శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. చనాక- కొరాట, లోయర్ పెన్ గంగా, ప్రాణహిత, నీల్వాయి, జగన్నాథపూర్, కుమ్రం భీం, కుఫ్టీ ప్రాజెక్ట్‌లు, చెన్నూర్ లిఫ్ట్ ఇరిగేషన్, ప్యాకేజీ 27 మరియు 28, సదర్మాట్ బ్యారేజీ, కడెం ప్రాజెక్ట్ పనులు, చెక్ డ్యాం నిర్మాణాలపై ఈ సమావేశంలో సమగ్ర చర్చించారు.
జిల్లాలోని ప్రాజెక్ట్ లు, చెక్ డ్యాంలు, పంపుహౌజులు, లిఫ్టులు, కాల్వల నిర్మాణ పురోగతిని అధికారులు వెల్లడించారు. తమ నియోజకవర్గంలోని సాగునీటి అవసరాలు, చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు సమావేశంలో వివరించారు. కొన్ని చోట్ల ఏజెన్సీలు పనులు నిలిపి వేశారని ప్రజాప్రనిదులు చెప్పడంతో.. అవసరమైతే పనులు చేయలేని పరిస్థితిలో ఉన్న పాత కాంట్రాక్టు సంస్థలను తొలగించి, వాటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రజా ప్రతినిధుల సూచనలు పరిగణలోకి తీసుకోవాలని.. ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రణాళికా బద్దంగా ముందుకు వెళ్ళాలని సూచించారు. చివరి ఆయకట్టుకుకు నీరందించాలన్న లక్ష్యంతో పని చేసి ప్రాజెక్ట్ లను పూర్తిగా సద్వినియోగంలోకి తేవాలన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్ట్‌లపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి సారించారని, పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్ లపై కూలంకశంగా చర్చించి సమగ్ర వివరాలను అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నామన్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలను సీఎం కేసీఆర్‌కు నివేదిస్తామని తెలిపారు.
ఈ సమీక్షలో ఎమ్మెల్యేలు జోగు రామన్న, దివాకర్ రావు, విఠల్ రెడ్డి, రేఖా శ్యాంనాయక్, రాథోడ్ బాపురావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్, ఈఎన్‌సీ మురళీధర్, జిల్లా జడ్పీ చైర్ పర్సన్లు కోవా లక్ష్మి, విజయలక్ష్మి రెడ్డి, ఓదెలు భాగ్యలక్ష్మి, జడ్పీ చైర్మన్ రాధోడ్ జనార్దన్, డీసీసీబీ చైర్మన్ నాందేవ్, నీటి పారుదల శాఖ సీఈలు శ్రీనివాస్ రెడ్డి, రమేష్, ఎస్ఈ లు, ఈఈ లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.