అడవుల సంరక్షణలో భాగంగా ఎంతో మంది ప్రాణత్యాగం చేశారని, వారి సేవలు ఎల్లప్పుడు గుర్తుంటాయని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం నెహ్రూ జూలాజికల్ పార్క్ వద్ద అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. తొలుత అమరవీరుల స్థూపం వద్ద విధి నిర్వహణలో అమరులైన వీరులకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…. ప్రకృతి వనరులను కాపాడటంతో పాటు వన్యప్రాణుల సంరక్షణకు అటవీ అధికారులు, సిబ్బంది ఎంతో శ్రమిస్తున్నారన్నారు. కరోనా మహమ్మారి అందరినీ బయపెట్టిన అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ధైర్యంగా నిలబడి విధి నిర్వహణ కొనసాగించడం అభినందనీయమని తెలిపారు. విధి నిర్వహణలో కరోనా బారినపడి కొంతమంది అధికారులు చనిపోవడం విచారకరమన్నారు.
ప్రజల భాగస్వామ్యంతో అమూల్యమైన అటవీ సంపదను కాపాడుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అటవీ సంపదను కాపాడాలనే లక్ష్యంతో అటవీ నేరాలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చట్ట సవరణలు చేసి నేరగాళ్ళపై పీడీ యాక్టు క్రింద కేసులు నమోదు చేయడం జరుగుతుందని, పోలీస్ శాఖ సహకారంతో ఇప్పటి వరకు పీడీ యాక్టు క్రింద 5 కేసులు నమోదు చేశారన్నారు.
ప్రకృతి ప్రసాదించిన వన సంపదను రేపటి మన భవిష్యత్తు, భావి తరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అటవీ ఉద్యోగులు సాహసాలకు పోకుండా అప్రమత్తంగా ఉండి అధికారుల సహకారంతో విధులు నిర్వహించాలని సూచించారు. అటవీ శాఖ సిబ్బంది సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, ఆత్మరక్షణతోపాటు అటవీ సంపదను కాపాడాలని కోరారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన వారి త్యాగనిరతికి గుర్తుగా అటవీ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవడం అభినందనీయమన్నారు. విధి నిర్వహణలో అమరులైన వారి త్యాగాలను మరువకూడదని, వారి సేవలను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలన్నారు.
ఈ కార్యక్రమంలో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, అటవీ అభివృద్ది సంస్థ వీసీ అండ్ ఎండీ రఘువీర్, ఆర్. హేమంత్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెస్ట్స్ (సౌత్ జోన్, చెన్నై) పీసీసీఎఫ్ లు డొబ్రియల్, లోకేష్ జైస్వాల్, అదనపు పీసీసీఎఫ్ లు స్వర్గం శ్రీనివాస్, చంద్రశేఖర్ రెడ్డి, పర్గెన్, జూ పార్క్ డైరెక్టర్ కుక్రేటి, జూ పార్క్ క్యూరేటర్ క్షితిజ, 2018 బ్యాచ్ కు చెందిన నలుగురు ఐఎఫ్ఎస్ ట్రైనీలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.