కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతు వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతాంగం చేపట్టిన భారత్ బంద్ సీఎం కేసీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి రైతులు, టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కడ్తాల్ గ్రామం వద్ద జాతీయ రహదారిపై రాస్తారోకో కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో వివిధ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్న మోదీ ప్రభుత్వం ఇప్పుడు నూతన వ్యవసాయ చట్టం తీసుకువచ్చి రైతుల నడ్డి విరుస్తుందన్నారు.కేంద్రం తీసుకువచ్చిన ఈ చట్టాల వల్ల కార్పోరేట్లకే లబ్ధి చేకూరేలా ఉందని, దీని వల్ల రైతులకు ఒరిగేదేమి లేదని పేర్కొన్నారు.పంటకు మద్దతు ధర ఇవ్వలేని చట్టం రైతులకు ఎలా మేలుచేస్తుందని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులు ఇతర ప్రాంతాలకు తమ పంటను తీసుకువెళ్లి అమ్మే పరిస్థితులు లేవన్నారు. పండించిన పంటల ధర కోసం రైతులు మధ్యవర్తులపై ఆధారపడాల్సిన దుస్ధితి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, కేరళకు చెందిన రైతులు ఢిల్లీలో చలిని సైతం లెక్క చేయకుండా పోరాడుతుంటే మోదీ ప్రభుత్వంలో చలనం లేదన్నారు. రైతులు చేపట్టిన ఆందోళనకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్ధతు ఇస్తుందని, బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్ర భుత్వం తీసుకున్న వ్యవసాయ చట్టాన్ని రద్దుచేయాలని మంత్రి డిమాండ్ చేశారు.అంతకుముందు భారత్ బంద్‌కు మద్ధతుగా నిర్మల్ పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.