గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ పట్టణంలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. నిర్మల్ పట్టణం చైన్ గెట్ నుండి బంగల్ పెట్ వరకు రూ. 5 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. నగరేశ్వర్ వాడ చౌరస్తా శిలాపలకం ఆవిష్కరించి పనులు ప్రారంభించారు. అలాగే ధర్మసాగర్ జాతీయ జెండా వద్ద రూ. 1 కోటి50 లక్షలతో చేపట్టబోయే సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. జిల్లా కేంద్రం ఏర్పడిన తరువాత నిర్మల్ పట్టణంలో జనాభా బాగా పెరిగిందని ఎన్నో ఏళ్ల నుండి అనుకుంటున్న రోడ్డు వెడల్పు పనులు పట్టణ ప్రజల సహకారంతో పూర్తి చేశామన్నారు. జిల్లా కేంద్రంలో సుమారు 300 400 స్కూల్ బస్సులు ఉన్నాయని రోడ్డు వెడల్పుతో ఇరుకు రోడ్ల సమస్య తొలగి పోయిందన్నారు. చైన్ గెట్ నుండి బంగల్ పెట్ వరకు రోడ్డు విస్తరణలో ప్రజలు స్వచ్ఛందంగా సహకరించారని రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యాయని.. మిషన్ భగీరథ పైపుల పనులు కూడా పూర్తయ్యాయని అన్నారు.
5 కోట్ల తో బీటీ రోడ్డు పనులు పూర్తి చేసి ఇరువైపులా డ్రైనేజి కాలువలు, ఎల్‌ఇడీ లైట్లు నిర్మిస్తామని తెలిపారు. ఇక జాతీయ జెండా ప్రాంగణంలో పార్కు , పచ్చని చెట్లను ఏర్పాటు చేయనున్నామని ఈ ప్రాంతాన్ని లేక్ వ్యూ లాగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ విజయ రాంకిషన్ రెడ్డి, అదనపు కలెక్టర్ హేమంత్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్,ఎఫ్‌ఎస్‌సీఎస్ చైర్మన్ ధర్మజి రాజేందర్, టౌన్ ప్రెసిడెంట్ మారుగొండ రాము, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.