రాష్ట్రంలో పీహెచ్‌సీ స్థాయి నుంచి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందిస్తున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు. లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ నిర్వహణలో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నందుకు నిర్మల్ ఏరియా దవాఖానకు ‘లక్ష్య’ గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ.. రాష్ట్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలిపింది.
ఈ నేపథ్యంలో స్పందించిన హరీష్… రాష్ట్రానికి చెందిన 13 ప్రభుత్వ ఆసుపత్రులు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నుంచి నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్ (NQAS) సర్టిఫికెట్లు సాధించాయి. అలాగే మరో మూడు దవాఖానలకు రీ-సర్టిఫికేషన్ వచ్చిందని హరీశ్‌రావు తెలిపారు.
అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఈ గుర్తింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఈ దిశగా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మొదటి స్థానమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. కార్పొరేట్ ఆసుపత్రులకే పరిమితమైన జాతీయస్థాయి నాణ్యతా ప్రమాణాల గుర్తింపును తెలంగాణలోని జిల్లా, ప్రాంతీయ, సామాజిక, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సాధిస్తున్నాయంటూ సంతోషం వ్యక్తం చేశారు.