హైదరాబాద్ వెంగల్ రావు నగర్ లోని IIHFW కార్యాలయం లో 108, 104, 102 నూతన ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ERC) ప్రారంభించారు మంత్రి హరీశ్ రావు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడతూ..’ఆరోగ్య తెలంగాణ’ సాధించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రం గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య రంగంలో అనేక సంస్కరణలను ప్రారంభించిందన్నారు. అత్యవసర వైద్య సేవలు అనేది మొత్తం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ముఖ్యమైన భాగం, ఎందుకంటే ఇది తక్షణ సంరక్షణను అందించడం ద్వారా ప్రాణాలను కాపాడుతుందన్నారు. తెలంగాణలో ఎమర్జెన్సీ మెడికల్ సేవలు మెరుగుపరచడానికి, ఈ కేంద్రీకృత కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం అని… వేర్వేరుగా ఉన్న 108, 102, మరియు 104 హెల్త్ హెల్ప్లైన్లను , ఒకే స్థానం నుంచి ఆపరేట్ చేయాలని నిర్ణయించి ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సెంటర్ (ERC) ప్రారంభించాం అన్నారు. 110 మందికి పైగా సిబ్బంది ఇక్కడ వుండి పని చేస్తుంటారు. 24 గంటల పాటు నిరంతర సేవలు ఇక్కడి నుండి ప్రజలకు అందుతాయన్నారు.
ERC యొక్క ప్రధాన లక్ష్యాలు:
• వాహనాల్లో GPS (గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్) పరికరాలను ఇన్స్టాల్ చేస్తాం కాబట్టి వాటిని మానిటరింగ్ చేయడానికి.
• ఇందులో వాడే అధునాతన సాఫ్టు వేర్ ద్వారా కాల్ రాగానే సమీపంలో ఉండే అంబులెన్స్ లు కంప్యూటర్ పై కనిపిస్తాయి. ఒక్క క్లిక్ చేయగానే వివరాలు ఆ అంబులెన్స్ కి వెళ్లి, వెంటనే అంబులెన్స్ చేరుతుంది
• కాల్ మేనేజ్మెంట్, పనితీరు పర్యవేక్షణ మరియు రిపోర్టింగ్ చేయడానికి.
• రోగులు/అత్యవసర రోగులకు 24×7 ప్రాతిపదికన రవాణా ఆరోగ్య సంరక్షణ మరియు చికిత్స అందించడానికి
• ఆసుపత్రికి రోగిని సకాలంలో తీసుకు వెళ్లడానికి వంటివి ప్రయోజనాలు.
• 108 ద్వారా తక్షణ వైద్య సహాయం అందిస్తున్నాం.
• 102 ద్వారా అమ్మ ఒడి సేవలు అందిస్తున్నాము.
• 104 ద్వారా ఫోన్ కాల్ లో వైద్య సమాచారం, సలహాలు, సూచనలు అందిస్తున్నాం.
108 వాహన సేవలు:
• అత్యవసర సమయాల్లో ప్రజలకు సాయం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం 108 అంబులెన్స్‌లు, అమ్మఒడి వాహనాలు అందుబాటులోకి తెచ్చింది. ఇవి రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సేవలు అందిస్తున్నాయి.
• రాష్ట్రంలో 108 అంబులెన్స్ సేవలు మొదటి నుంచి ఉన్నాయి. గర్భిణుల కోసం సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు ప్రత్యేకంగా 102 అమ్మఒడి వాహనాలను 2017-18లో ప్రారంభించారు.
• పార్థివదేహాలను తరలించేందుకు ‘హర్సె’ వాహనాలను 2016-17లో ప్రవేశపెట్టారు.
• ఈ మూడు రకాల వాహనాలు ప్రజలకు నిత్యం సేవలు అందిస్తున్నాయి. ఇప్పటివరకు 1.03 కోట్ల మంది వీటి ద్వారా లబ్ధి పొందారు.
• ప్రస్తుతం మూడు రకాల వాహనాలు కలిపి 776 అందుబాటులో ఉన్నాయి.
• ఇటీవల సీఎం కేసీఆర్ గారు 466 వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో 204 అంబులెన్సులు, 228 అమ్మఒడి వాహనాలు, 34 హర్సె వాహనాలు ఉన్నాయి.
• 108 అంబులెన్స్ లు ప్రస్తుతం 426 అందుబాటులో ఉన్నాయి. రోజుకు సగటున 1,456 మందికి ఎమర్జెన్సీ సేవలు అందుతున్నాయి.
• ఇప్పటివరకు 44 లక్షల 57 వేల మంది ఎమర్జెన్సీ సేవలు పొందారు.
• ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండాలి. రాష్ట్రంలో 75 వేల జనాభాకు ఒక అంబులెన్స్ ఉన్నది.
• ప్రస్తుతం 108కు ఫోన్ చేసిన తర్వాత సగటున 15 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకుంటున్నది. సాంకేతికత సహాయంతో వెయిటింగ్ సమయం మరింత తగ్గనున్నది.
Also Read:ఉలవలతో ఎన్ని ప్రయోజనాలో!
అమ్మ ఒడి -102 వాహనాలు:
• ఒకప్పుడు గర్భిణులు, బాలింతలు ఏఎన్సీ, పీఎన్సీ చెకప్ కోసం సమీపంలోని దవాఖానకు వెళ్లాలంటే బస్సుకో, ఆటోకో, సొంత వాహనాల్లోనో వెళ్లాల్సి వచ్చేది. ప్రైవేట్ వాహనాల్లో వెళ్తే బస్టాప్ నుంచి దవాఖాన వరకు నడవాల్సి వచ్చేది. బైక్‌లపై వెళ్తే తీవ్ర ఇబ్బంది పడేవారు. పైగా ప్రయాణ ఖర్చు అదనం.
• దీంతో కొందరు ఒకటిరెండు చెకప్‌లకు దూరంగా ఉండేవారు. ఇది తల్లీబిడ్డల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపేది.
• ఈ పరిస్థితిని తప్పించడానికి సీఎం కేసీఆర్ ఒక కుటుంబ పెద్దగా ఆలోచించి ‘అమ్మ ఒడి’ వాహన సేవలను ప్రారంభించారు.
• 102 పేరుతో 2017-18లో మొదలైన ఈ సర్వీసులు గర్భిణులు, బాలింతలకు వరంగా మారాయి.
• 300 వాహనాలు ఉన్నాయి. రోజుకు సగటున 3,792 మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు.
• ఇప్పటివరకు 58,53,618 మందిని అమ్మ ఒడి వాహనాలు గమ్యానికి చేర్చాయి.
• ఈ కాల్ సెంటర్ ద్వారా ప్రజలకు మరింత వేగంగా అత్యవసర సేవలు అందుతాయి.