తెలంగాణపై కనీస పరజ్ఞానం లేని వాళ్లు కూడా ఇక్కడ రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి హరీశ్ రావు. సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన హరీశ్ రావు…షర్మిల కొత్తపార్టీపై స్పందించారు.
ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగింది అని మాట్లాడుతున్నారు. ఇక్కడికొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారు….అసలు వాళ్లకు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా? అని ప్రశ్నించారు. ఏపీలో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి ఎంత భూమి ఉన్నా రూ. 12.500 మాత్రమే ఇస్తున్నారని, అదే ఇక్కడ ఎకరానికి పదివేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు కూడా రైతుబంధు ఇస్తున్నామని హరీష్ గుర్తు చేశారు.
రైతు వేదికలు.. రైతు ఆత్మగౌరవ భవనాలని రూ.600 కోట్లతో 2500 రైతు వేదికలు నిర్మించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా లేవన్నారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్‌కు రూ.12వేల కోట్లు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. రైతులు రూ.6 వేలకంటే తక్కువ ధరకు కందులు విక్రయించొద్దని సూచించారు.