ఆహార కల్తీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు..

82
harishrao
- Advertisement -

ఐపీఎం, ఫుడ్ సేఫ్టీ విభాగం ల్యాబ్స్ పని తీరు, సాధించిన పురోగతిపై వెంగళ్ రావు నగర్ లోని IIHFW కార్యాలయంలో ఆర్థిక, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీశ్ రావు గారు సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ..ఆహార పదార్థాలు కల్తీ చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడేవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదన్నారు. సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిచింది. ఫుడ్ సేఫ్టీ విషయంలోనూ తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలి, అగ్రస్థానం చేరాలని కాంక్షించారు. అధికారులు లేని చోట జిల్లా వైద్యాధికారులకు ఫుడ్ సేఫ్టీ బాధ్యతలు ఇవ్వాలి, వారికి అవసరమైన శిక్షణ ఇవ్వాలి. ఖాళీగా ఉన్న పోస్టుల్లో టీఎస్పీఎస్సీ ద్వారా త్వరలో భర్తీలు చేపడతామని తెలిపారు. ఉత్తమ విధానాలు అనుసరించి, మెరుగైన ఫలితాలు సాధిస్తున్న రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి విధానాలు అధ్యయనం చేసి నివేదిక రూపొందించాలని సూచించారు. నెలలో రెండు శనివారాల్లో లైసెన్సింగ్ కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలన్నారు.

ఒక వైపు కల్తీ చేసే వారిపై చర్యలు తీసుకుంటూనే, మరోవైపు ప్రజల్లో అవగాహన పెంచే దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీ ఆహారాలతో ప్రజారోగ్యం దెబ్బతింటోంది, కల్తీ ఆహారం వల్ల దీర్ఘకాలంలో మధుమేహం, అధిక రక్తపోటు వంటి అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని తెలిపారు. జీర్ణకోశ సమస్యలు, క్యాన్సర్‌ వంటి ప్రమాదకర జబ్బులకు దారితీస్తుంది. కల్తీ ఆహారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కల్తీని అడ్డుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నదని మంత్రి హరీష్ పేర్కొన్నారు. ప్రజలు సైతం బాధ్యతగా వ్యవహరించి, ఎక్కడైనా కల్తీ జరిగినట్లు, నాణ్యత లేనట్లు సమాచారం ఉంటే.. 040 21111111 నెంబర్ కి కాల్ చేసి లేదా, @AFCGHMC ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఫిర్యాదులు రాగానే అధికారులు వెళ్లి చర్యలు తీసుకుంటారు. ప్రభుత్వం ఆహార కల్తీని అడ్డుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నది. కోర్టు కేసులు పెండింగ్ లేకుండా చూసుకోవాలి, త్వరగా పరిష్కారం అయ్యేలా చొరవ చూపి కల్తీ చేసే వారి ఆట కట్టించాలి. ప్రజల ఆరోగ్యానికి ఎక్కువగా నష్టం కల్గించే కల్తీ ల పై ప్రత్యేక దృష్టి సారించాలి. అన్ని మొబైల్ వాహనాలు పని చేయాలి. టాస్క్ ఫోర్స్ బృందాలు జిల్లాల్లో ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. సమీక్షలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం కమిషనర్ శ్వేత మహంతి, ఐపిఎం, ఫుడ్ సేఫ్టీ డైరెక్టర్ శివ లీల, టీవీవీపీ కమిషనర్ అజయ్ కుమార్, అన్ని జిల్లాల ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -