ఆరోగ్య తెలంగాణే లక్ష్యమన్నారు మంత్రులు హరీశ్ రావు, కొప్పుల ఈశ్వర్. జగిత్యాల పట్టణంలో వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి ప్రారంభించారు హరీశ్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఆరోగ్య రంగాన్ని దేశంలో మొదటి స్థానంలో నిలపాలన్నారు. సిజెరీయన్లు తగ్గాలి, సాధారణ ప్రసవాలు పెరగాలన్నారు. సిజేరియన్ లకు అయ్యగార్లు ముహూర్తాలు పెట్టే మూఢనమ్మకం పోవాలన్నారు.
మన జ్వర సర్వే సూపర్… ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. ఆశా కార్యకర్తలు బాగా పని చేశారు. అందుకే ముఖ్యమంత్రి గారు మూడు సార్లు జీతాలు పెంచారు. నాడు జీతాల కోసం ధర్నాలు, నిరసనలు చేశారు. 2014 లో రు. 1500 ఉంటే ఇప్పుడు రు. 9750 ఇస్తున్నాం. గుజరాత్ లో 4000 మాత్రమే, రాజస్థాన్ లో 3000 మాత్రమే, మధ్య ప్రదేశ్ లో 3000 మాత్రమే. మీ కష్టాన్ని సీఎం కేసీఆర్ గుర్తించారన్నారు.
సిజేరియన్లు తగ్గించడంలో సాధారణ ప్రసవాలు పెంచడంలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, పీహెచ్సీ వైద్యులది ముఖ్య పాత్ర అన్నారు.సాధారణ ప్రసవాలు చేసే ప్రభుత్వ వైద్య బృందానికి మూడువేల ఇన్సెంటివ్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం అమలు చేస్తాం. ఇదే సమయంలో సిజేరియన్లు చేసే వైద్య బృందానికి ఇన్సెంటివ్ తొలగిస్తున్నామన్నారు.