సిద్దిపేట జిల్లాలో 50 వేల ఎకరాల్లో పామాయిల్ సాగు చేయాలని నిర్ణయించామని తెలిపారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట పట్టణం రెడ్డి ఫంక్షన్ హాల్‌లో జడ్పీ చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మాట్లాడిన హరీశ్ రావు..పామాయిల్ సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం లభిస్తుందన్నారు.
పామాయిల్ సాగుకు చీడ, పీడల బెడద ఉండదు.. అటవీ జంతువుల బాధలు కూడా ఉండవని చెప్పారు. అంతర పంటలకు సాగుకు కూడా అవకాశం ఉంటుందన్నారు. కరపత్రాలతో పాటు బహుళ ప్రసార మాధ్యమాల ద్వారా పామాయిల్ సాగు వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు వివరించాలని సూచించారు.
పామాయిల్ పంట సాగుతో పాటు పట్టు పురుగుల పెంపకంతో రైతులకు అధిక ఆదాయం సమకూరుతుందన్నారు. ఈ రెండు పంటల పెంపకంను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ముందుకు వచ్చే ప్రజాప్రతినిదులు, రైతులకు ఖమ్మం జిల్లా, కర్ణాటక రాష్ర్టానికి విజ్ఞాన యాత్రలు ఏర్పాటు చేస్తామన్నారు.