తలసేమియా వ్యాధి నివారణకు కృషి చేస్తాం- మంత్రి హరీష్‌

52
- Advertisement -

తెలంగాణ రాష్ట్రాన్ని తలసేమియా రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు. శనివారం తలసేమియా, సికెల్ సెల్ సోసైటీ ఆధ్వర్యంలో కమలా హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన స‌ద‌స్సుకు మంత్రి హ‌రీష్‌ రావు ముఖ్యఅతిథిగా హాజ‌రైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో తలసేమియా రహిత తొలి రాష్ట్రంగా తెలంగాణను నిలుపుతామన్నారు. ఆరోగ్య శ్రీ ఆధ్వర్యంలో తలసేమియా ,సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ఉచితంగా చికిత్స అందిస్తున్నామని అన్నారు. ఈ వ్యాధి నివారణకు మా వంతు కృషి చేస్తామ‌ని మంత్రి హ‌రీష్‌ రావు స్ప‌ష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఉస్మానియా, నీలోఫర్, గాంధీ ఆసుపత్రుల్లో తలసేమియా రోగులకు చికిత్స అందిస్తోంద‌న్నారు. బ్లడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాల్సి ఉంద‌న్నారు. ఆదిలాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువ‌గా ఉన్నట్లు తెలుస్తోంద‌న్నారు మంత్రి. క‌మ‌లా సొసైటీకి ప్ర‌భుత్వం పూర్తిగా స‌హ‌క‌రిస్తుంద‌న్నారు. రెడ్ క్రాస్ సోసేటీ, కమలాసోసైటీ వంటి సంస్థలతో మరో మారు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఇంకా తలసేమియా అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిద్దామ‌ని పేర్కొన్నారు. తెలంగాణలో కమలా సోసైటీ తలసేమియా రోగులకు మంచి సేవ అందిస్తోంద‌ని మంత్రి హరీష్‌ ప్ర‌శంసించారు.

- Advertisement -