కేంద్ర ప్రభుత్వం సెస్సుల రూపంలో వసూలు చేసే మొత్తాన్ని డివిజనల్ పూల్ లోకి తేవాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ఈరోజు జరిగిన ప్లీనరీలో మంత్రి హరీశ్ రావు బీజేపీ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ నేతలకు, కార్యకర్తలకు 21వ పార్టీ ఆవిర్భావ దినోత్స శుభాకాంక్షలు తెలిపారు. రానే రాదన్న తెలంగాణను సాధించి, దేశంలో తెలంగాణలోను ఆదర్శరాష్ట్రంగా నిలిపారు ముఖ్యమంత్రి కేసీఆర్. 14 ఏళ్లు పోరాడి ఎత్తిన పిడికిలి దించకుండా రాష్ట్రాన్నిసాధించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. దేశంలో అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రమైనా, అన్ని రాష్ట్రాలకు దశ-దిశ చూపింది తెలంగాణ అని హరీశ్ అన్నారు.
దేశానికి సీఎం కేసీఆర్ రూపొందించిన ప్రగతిశీల ఎజెండా దేశానికి అవసరం. పక్క రాష్ట్రాల నుంచి కేసీఆర్ ఎజెండా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నరు. రైతు బంధు, దళిత బందు, ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి, మిషన్ భగీరథ వంటి పథకాలు మాకు కావాలని పక్క రాష్ట్ర బీజేపీ నేతలు కోరుతున్నారు. సీఎం ఆలోచనలు, చిన్న పాలసీలు కావచ్చు. ఎన్నో గుణాత్మక మార్పుకు నాందిపలికాయి. పల్లె ప్రగతి, పట్ణ ప్రగతి అద్బుతమైన ఆలోచనతో కేసీఆర్ స్థానిక సంస్థలను బలోపేతం చేశారు. వారికి నిధులు, విధులు, ఉద్యోగాలు కల్పించి 13 వేల కోట్ల రూపాయలు ఇస్తే దేశంలో సన్సద్ ఆదర్శ్ గ్రామ యోజన కింద పదికి పది తెలంగాణ గ్రామాలు మొదటి స్థానంలో ఉన్నాయంటే ఎంత అభివృద్ధి, ఎంత అద్భుత ఫలితాలు సాధించాం. గ్రామాలు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుందని ఆలోచించాం అన్నారు.
కేంద్ర ప్రభుత్వం సిద్ధాంతం ఏంటంటే బలమైన కేంద్రం- బలహీనమైన రాష్ట్రాలు. రాష్ట్రాలు ఆర్థికంగా బలహీనంగా ఉండాలే, రాష్ట్రాలక అధికారాలు తగ్గించాలి ఇది బీజేపీ ప్రభుత్వ సిద్దాంతం. రాష్ట్రాలు కేంద్రం చెప్పు చేతల్లో ఉండాలని చేస్తోన్న ప్రయత్నం ఇది. బీజేపీ ప్రభుత్వానిది వైఫల్యాల చరిత్ర- తెలంగాణ ప్రభుత్వానిది సాఫల్యాల చరిత్ర హరీష్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత విద్యుత్, పల్లె ప్రగతి,పట్టణ ప్రగతిలోసాధించిన అద్భుత ఫలితాలు, ధరణి పోర్టల్ తో భూసమస్యల పరిష్కారం. కొద్ది గంటల్లోనే పాస్ బుక్ లు, రిజిస్ట్రేష్లు వస్తున్నాయి. మల్లన్న సాగర్ ప్రాజెక్టు ప్రారంభిస్తే ఇది కానే కాదన్నరు. గోదావరి నీళ్లు రానే రావన్నరు. గౌరవ ముఖ్యమంత్రి పట్టుబట్టి రాత్రింబవళ్లు పని చేస్తే..కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకుని నీళ్లు ఇస్తున్నం. తెలంగాణ అంతా సస్యశ్యామలం అయింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే మహబూబ్ నగర్ పచ్చబడింది. తెలంగాణ ఇస్తే చీకటి అని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నరు. కాని గౌరవ ముఖ్యమంత్రి ఒక్క ఏడాదిలోపే దేశంలో 24 గంటలు అన్ని రంగాలకు కరెంటు ఇచ్చే రాష్ట్రంగా మార్చి చూపారు.
99 లక్షల టన్నుల ధాన్యం తెలంగాణ రాాష్ట్రం ఏర్పడే ముందు పండితే 2 కోట్ల 50 లక్షల టన్నులు పండుతుంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ మాట్లాడుతూ ఏడేళ్లలో ఇంత వడ్లు ఎలా పండుతున్నయి అని మాట్లాడుతున్నడు. చేసింది దాన్ని కూడ అంగీకరించలేకపోతున్నరు. పట్టుబట్టి రాదనుకున్న తెలంగాణ తెచ్చారు. చీకట్లో నుండి రాష్ట్రాన్ని విద్యుత్ వెలుగులు తెచ్చారు. కాళేశ్వరం నీరు తెచ్చారు. ధరణి, పల్లె ప్రగతి వంటి అద్బుత ఫలితాలు సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేంద్ర ప్రభుత్వంది వైఫల్యాల చరిత్ర. బీజేపీ ప్రభుత్వం బాగా మాటలు మాట్లాడతరు. ఏడేళ్లలో దేశ ఆర్థిక వృద్ధి రేటు పడిపోయింది. ఆనాడు 8 శాతం ఉంటే ఇవాళ 5.7 శాతానికి పడిపోయింది. బీజేపీ ధరలు పెంచి, మతకల్లోలాలు సృష్టించి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నరు. అచ్చే దిన్ అన్నరు…కాని దేశ ప్రజలకు చచ్చే దిన్ చేశారు. నల్ల ధనం తెస్తమన్నరు. కాని రైతాంగానికి నల్ల చట్టాలు తెచ్చారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తమన్నరు. ఉద్యోగాలు ఇవ్వలేదు కాని ఉన్న ఉద్యోగాలు ఊడగొడ్తున్నరు.
కొత్త పరిశ్రమలు తెస్తా అన్నరు. కాని ఉన్న పరిశ్రమలను అమ్ముకుంటున్నరు. బీజేపీ ప్రభుత్వం అమ్మిన ప్రభుత్వ రంగ సంస్థల విలువ మూడున్నర లక్షల కోట్లు. ఇని అమ్మి ఎస్సీ, ఎస్టీ.బీసీలకు రిజర్వేషన్లు లేకుండా చేసిన చరిత్ర బీజేపీ ప్రభుత్వానిది. మోడీ గారు ఛాయ్ అమ్మిండని, బుల్లెట్ ట్రైన్లు తెస్తమని, కాని వాస్తవంగా జరుగుతుందేంటి. రైళ్లు అమ్ముడు, రైల్వే లైన్లు అమ్ముడు. ఉన్న ఉద్యోగాలు తొలగించుడమే. బీజేపీ ప్రభుత్వం రాక ముందు నిరుద్యోగం 4.7 శాతం ఉంటే, ఏడేళ్ల బీజేపీ పాలనలో నిరుద్యోగం 7.11 శాతానికి పెరిగింది. పెద్ద నోట్ల రద్దు అన్నరు. పెద ప్రజల అక్కౌంట్లలో డబ్బులు వేస్తమన్నరు. జన్ ధన్ ఖాతాలన్నరు. కాని ఒక్క రూపాయి పేదలకు ఇవ్వలేదు. రైతుల ఆదాయం డబులు చేస్తమన్నరు. కాని ఖర్చులు పెంచిండ్రు. ఎరువుల ధరలు, డీజీల్ ధరలు పెంచిండ్రు. వరికోత 1500 ఎకరానికి వస్తే, ఇవాళ 3 వేల ఖర్చు అవుతుంది. పోటాష్ 1800 రూపాయలకు పెరిగింది. రైతుల ఆదాయం పెరగలేదు. పెట్టుబడి మాత్రం పెరిగేలా చేశారు. రైతుల ఉసులు పోసుకుంటున్నరు.
బీజేపీ ప్రభుత్వం కార్మికులకు, ఉద్యోగులకు, కర్షకులకు, యువతకు,మహిళలకు, ఎస్సీలకు,ఎస్టీలకు, బీసీలకు ఏ వర్గానికి ఉపయోగపడింది. ఎవరికి మేలు చేసింది. సంపద పెంచాలని, పేదలకు పెంచాలన్నది టీఆర్ఎస్ నినాదం. పేదలను దంచాలి. పెద్దలకు పెంచాలన్నది బీజేపీ నినాదం. మనం ఉచిత విద్యుత్, కళ్యాణ లక్ష్మి, రైతు బందు, కేసీఆర్ కిట్ అనిపేదలకు సాయం చేస్తుంటే, బీజేపీ ప్రభుత్వం కార్పోరేట్ పెద్దలకు, బడా పారిశ్రమిక వేత్తలకు 11 లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసింది. మీరు ఎటు వైపు టీఆర్ఎస్ పేదలవైపు ఉంటే, బీజేపీ పెద్దల వైపు కార్పోరేట్ కంపెనీల వైపు ఉన్నారు. మాటలు మాట్లాడితే టీం ఇండియా అంటరు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మాత్రమే టీం ఇండియా, బీజేపీయేతర రాష్ట్రాలను ఇబ్బంది పెట్టడమే పని. డబులు ఇంజన్ గ్రోత్ అంటరు. తెలంగాణ రాష్ట్రం అద్భుత ఫలితాలు సాధిస్తుంటే ఇంజన్ కు బ్రేకులు వేస్తరు. టీం ఇండియా అంటరు. టీం లేదు, ధీమ్ లేదు… ఉన్నది పొలిటికల్ గేమ్ మాత్రమే అని హరీష్ విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో 41 శాతం రాష్ట్ర ప్రజల హక్కుగా కేంద్రం పంచాల్సి ఉంది. కాని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పంచాల్సి వస్తుందని సెస్స్ ల రూపంలో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తోంది. సెస్ లు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రూపంలో కేంద్రం డబ్బులు సమకూర్చుకుంటోంది. రాష్ట్రానికి 41 శాతం ఇవ్వాల్సిన చోట 29.6 శాతం మాత్రమే కేంద్రం ఇస్తుంది. 11.4 శాతం సెస్సుల రూపంలో దొడ్డి దారిన కేంద్రం ఆదాయం సమకూర్చుకుంటుంది. రాష్ట్రాలకు వాటా తగ్గిస్తోంది. ఇది 14,15వ ఆర్థిక సంఘం సైతం తన నివేదికలో ఇది తప్పని ఎత్తి చూపింది. న్యాయబద్దంగా రాష్ట్రాలకు 41 శాతం ఇవ్వండి. సెస్సుల డబ్బులు రాష్ట్రాలకు పంచాలని సూచించింది. రాష్ట్రాలకు 62 శాతం ఖర్చులు ఉంటే 37 శాతం ఆదాయం వస్తోందని, కేంద్రానికి 37 శాతం ఖర్చులు ఉంటే 63 శాతం ఆదాయం వస్తుందని ఆర్థిక సంఘమే స్పష్టంగా చెప్పింది. రాష్ట్ర జాబితా అంశాలు ఎక్కువ ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వాలే ప్రజలకు దగ్గరగా ఉండి సేవలు అందిస్తాయి. 14,15 వ ఆర్థిక సంఘాలు మొట్టి కాయ వేసి చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదు. పెట్రోల్ మీద బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. స్పెషల్ ఎక్సైజ్ డ్యూటీ, అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ పేరుతో రోడ్ సెస్సులు అని రకరకాల పేర్లతో డివిజబుల్ పూల్ లోకి డబ్బులు రాకుండా అడ్డుకుంటోందని మంత్రి హరీశ్ దుయ్యబట్టారు.
కేంద్రం పన్నులు పెంచుతుందట- రాష్ట్రాన్ని మాత్రం పన్నలు తగ్గించామని లోకల్ బీజేపీ నేతలు చెబుతురు. పెట్రోల్, డిజీల్ మీద రాష్ట్రం ఎప్పుడైనా పన్నులు పెంచిందా. 2015లో ఒక్క సారి అడ్జస్ట్ మెంట్ చేసిందంతే. కేంద్రం బలవాలే- రాష్ట్రాలు బక్కపడాలా.. ఇదేక్కడి నీతి. సెస్సుల విషయానికివస్తే బీజేపీ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో సెస్సుల రూపంలో 24 లక్షల కోట్ల రూపాయలు సమకూర్చుకుంది. మన హక్కుగా మనకు ఇందులో 54 వేల కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. దేశంలోని అన్ని రాష్ట్రాలకు కేంద్రం అన్యాయం చేసింది. కేంద్ర ప్రభుత్వం రాక ముందు దేశంలో సెస్సులు 10 శాతం ఉండేది. మన్మోహన్ ప్రధాని సమయంలో. కాని బీజేపీ అధికారంలోకివచ్చాక 20 శాతానికి సెస్సులు పెంచారు. గొర్రెలు తినేటోడు పోయి- బర్రెలు తినేటోడు వచ్చినట్లు అయింది. మనం పల్లెలకు, పట్టణాలకు 13 వేల కోట్లు ఇస్తే ఎలాంటి అద్భుత ఫలితాలు వచ్చాయి. కేంద్రం ఇదే రీతిలో సమాఖ్య స్పూర్తితో వ్యవహరిస్తే దేశం ముందుకు వెళ్లేది కదా.. దేశ ప్రజల కంటే, రాష్ట్రాల అభివృద్ది కంటే బీజేపీకి రాజకీయాలే ముఖ్యం. ఈ సెస్సులు రద్దు చేయాలని, డివిజబుల్ పూల్ లోకే డబ్బలు తీసుకురావాలని, కేంద్రానికి ఏ రూపంలో డబ్బులు వచ్చినా రాష్ట్రాలకు 41 శాతం డబ్బులు ఇవ్వాలని ఈ సభలో తీర్మానం ప్రతిపాదిస్తున్నం అని హరీశ్ తెలిపారు.
సీఎం గారికి ఓ వినతి.. మీరు తెలంగాణ రాష్ట్రం సాధించారు. రాష్ట్రాన్ని దేశంలో ఆదర్శంగా నిలిపారు. మీరు రాష్ట్రాల సీఎంలను ఏక తాటిపైకి తెచ్చి, సెస్ లు రద్దు చేసేలా, 41 శాతం ఆదాయం రాష్ట్రాలకు న్యాయబద్దంగా ఇచ్చేలా కేంద్రంపై పోరాడాలని, ఇందుకు నడుం బిగించాలని సభ ద్వారా కోరుతున్నాను అన్నారు. ఏ ప్రధాని అయినా ఫైనాన్స్ కమిషన్ రిపోర్టు ఇస్తే తు.చ తప్పకుండా పాటించేవారు. కాని నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం దీన్ని పక్కన పెట్టారు. 15వ ఆర్థిక సంఘం తన నివేదికలో 6103 కోట్లు గ్రాంట్ గా ఇవ్వాలని సూచిస్తే, దాన్ని పక్కన పెట్టి అన్యాయం చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. సెస్సుల రూపంలో ఈ ఏడేళ్లో 54 వేల కోట్లు రాకుండా చేసిన ప్రభుత్వం మోదీ ప్రభుత్వం. నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు 20 వేల కోట్లు, మిషన్ కాకతీయకు 5 వేల కోట్లు ఇవ్వమంటే ఒక్క రూపాయి ఇవ్వని ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. బాయిల కాడ మీటర్లు పెట్టాలని గొంతుపై కత్తి పెట్టింది. 25 వేల కోట్లు ఇస్తమన్నరు. మన నాయకుడు కేసీఆర్ నా గొంతులో ప్రాణం ఉండగా బాయిల కాడ మీటర్లు పెట్టేది లేదన్నరు. మీ 25 వేల కోట్లు అవసరం లేదని తెగేసి చెప్పిన నాయకుడు మన కేసీఆర్ అని హరీశ్ అన్నారు.
బాయిల్డ్ రైస్ కొనమని మెలిక పెట్టి 3వేల కోట్ల రూపాయలు రాష్ట్రంపై భారం వేశారు. ఇచ్చే డబ్బులు 7103 కోట్లు రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు పెండింగ్ లో పెట్టారు. లేఖలు రాసినా , కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదు. ఎఫ్.ఆర్.బి.ఎం లో కేంద్రం తొమ్మిదిన్నర శాతం తెచ్చుకోవచ్చు. పరిమితి దాటి అప్పులు తెచ్చుకుంటున్నరు. రాష్ట్రాలకు 4 శాతమే. బాయిలకాడ మీటర్లు పెడితేనే ఇస్త అని ఇబ్బందులుపెడుతున్నరు. రాజకీయ సంకుచితంగా బీజేపీ వ్యవహరిస్తోంది. బీజీపేయేతర ప్రభుత్వాలను ఇబ్బందిపెడుతోంది. దీనిపై మనం పోరాడాలి అని పిలుపునిచ్చారు. దేశం ముందుకు పోవాలంటే సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఓ ఎజెండా అవసరం. మోదీ గారు సబ్ కేసాత్..సబ్ కా వికాస్ గొప్పగా చెప్తరు. కాని చేసేదంతా భక్వాస్.. ఆత్మ నిర్భర్ భారత్ అంటరు.. కాని బతుకు దుర్భర్ భారత్ అయింది. ఆకలి సూచిల్లో మనం ఎక్కడో ఉన్నం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మనకన్నా ముందున్నవి. ఇది బీజేపీ పాలనా తీరు. సెస్సుల డబ్బులు డివిజబుల్ పూల్ లోకి కేంద్రం తీసుకురావాలని తీర్మానాన్ని ప్రతిపాదిస్తున్న అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.