మీ మాటలు నమ్మి ఎవరూ ఓటు వేయరు- మంత్రి హరీష్‌

120
- Advertisement -

రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దు.. రాష్ట్రంలో పండిన ప్రతి వడ్ల గింజనూ రాష్ట్ర ప్రభుత్వమే కొంటదని ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ రావు అన్నారు. వాన కాలంలో తడిసిన వడ్లను కూడా కొనుగోలు చేస్తామని, రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని వెల్లడించారు. ఆదివారం హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం మామిడాలపల్లి, ఇప్పలపల్లి, ఎలుబాక, గంగారం, కొండపాక, శ్రీరాములపేట, కిష్టంపేట గ్రామాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో కలిసి మంత్రి ప్రచారం నిర్వహించారు. వీణవంకలో ధూంధాంలో పాల్గొన్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్‌పేటలో వేర్వేరుగా నిర్వహించిన ఎరుకల, వాల్మీకి బోయ కులస్థుల ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి మాట్లాడుతూ.. బీజేపీ నాయకుల ఝూటామాటలతో ఆగం కావొద్దని కోరారు. రైతుల బాధలు అర్థం చేసుకొని సీఎం కేసీఆర్‌ కడుపులో పెట్టుకొని సాదుకొంటుంటే.. యూపీలో రైతులపై కార్లు ఎక్కించి చంపింది బీజేపీయేనని విమర్శించారు.

కడుపులో పెట్టుకొని సాదుకునేటోళ్లు కావాలో? కార్లు ఎక్కించి సంపెటోళ్లు కావాలో? ప్రజలు ఆలోచించాలని కోరారు. మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి స్వగ్రామం మామిడాలపల్లికి రావడం సంతోషంగా ఉన్నదన్నారు. ఈటల తనకేదో అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నాడని, నాడు ముద్దసాని మీద ఈటల గెలిచాడంటే సీఎం కేసీఆర్‌ ఇచ్చిన టికెట్‌, కారు గుర్తు చూసి ఓటు వేశారని మరిచిపోవద్దని హితవుపలికారు. గెలిస్తే ప్రజలు, రైతులకు ఏం చేస్తాడో ఈటల ఇప్పటికీ చెప్పట్లేదని విమర్శించారు. సోషల్‌ మీడియాలో ఫేక్‌ వీడియోలను నమ్మకుండా యువత న్యాయం, ధర్మం వైపు నిలబడి మన కోసం ఎవరు కష్టపడతారో ఆలోచించాలని కోరారు. రాజకీయంగా ఎదగడం కోసమే రాజేందర్‌ రాజీనామా చేశాడని తెలిపారు. ఈటల గెలిస్తే బీజేపీకి లాభం జరుగుతుందని, గెల్లును గెలిపిస్తే హుజూరాబాద్‌ ప్రజలకు లాభం జరుగుతుందని స్పష్టంచేశారు.

కల్యాణలక్ష్మితో కడుపు నిండదని ఈటల అంటున్నారని, కల్యాణలక్ష్మి ఉండాలా? వద్దా..? అని హరీశ్‌రావు ప్రజలను అడిగారు. రైతుబంధు దండగా అంటున్నోడికి ఓటు ఎందుకు వేయాలో రైతులు ఆలోచించాలని కోరారు. గ్యాస్‌ సిలిండర్‌ గురించి ఈటల ఒక్కమాట ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. మహిళా రుణమాఫీ చెక్కుల విషయంలోనూ బట్టకాల్చి మీద వేస్తున్నడని మండిపడ్డారు.పెట్రోల్, డిజీల్ , గ్యాస్ ధర తగ్గిస్తవా రాజేందర్ చెప్పు. అది చెప్పకుండా మోసపుమాటలు చెప్తే వీణ వంక ప్రజలు బుద్ది చెబుతారు. మీ మాటలు నమ్మి ఎవరూ ఓటు వేయరు అని మంత్రి హరీష్ ఎద్దేవ చేశారు.

- Advertisement -