రాష్ట్రంలో ప్రతిపక్షాలు మంచి పని చేస్తే అపశకునం పలుకుతున్నాయి.. 50 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసుకున్నారు కానీ ఏనాడూ రూపాయి దళితులకు ఇవ్వలేదు. ఇక బీజేపీకి దళితులు అంటేనే గిట్టదు అని మడిపడ్డారు మంత్రి హరీష్ రావు. సోమవారం ఆయన సంగారెడ్డి పట్టణం, అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన దళిత బంధు కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా దళిత బంధు అందిస్తున్నారు. వచ్చిన పని నచ్చిన పని చేసుకోమని సీఎం కేసీఆర్ అవకాశం కల్పించారు. అప్పుడు హుజూరాబాద్‌లో ఇచ్చినం.. ఎన్నికలు కాబట్టి అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న సంగారెడ్డిలో ఇస్తున్నాం. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దమ్ముంటే దళిత బంధు అమలు చేయాలి అని మంత్రి సవాల్ చేశారు.

కానే కాదు అన్న వాళ్ల ముఖం మీద గుద్దినట్టు కాళేశ్వరం మూడు ఏళ్లలో పూర్తి చేశాం. రేపో మాపో సంగారెడ్డికి గోదారి నీళ్ళు తెస్తాం.. అన్ని జరిగితే టీఆర్‌ఎస్‌కు మంచి పేరు వస్తదని కాంగ్రెస్, బీజేపీకి భయం పట్టుకున్నది. కేంద్రం దళితులకు పెట్టిన బడ్జెట్ ఎంత ? దేశం మొత్తం పెట్టిన దాని కంటే మేము దళిత బంధు కోసం 17,800 కోట్లు పెట్టాము. మేము జనం కోసం తిరిగితే.. అపశకునం గాళ్ళకు మీరే బుద్ది చెప్పాలి. బండి సంజయ్ నీ తొండి మాటలు బంజెయ్.. గ్యాస్ ధరలు, నిత్యావసర ధరలు ఎప్పుడు తగ్గిస్తావ్ అని యాత్రలో అక్క చెల్లెళ్ళు నిలదీస్తున్నారు. మా ఉద్యోగాలు ఏవి అని నిరుద్యోగులు అడుగుతున్నారు. బండి సంజయ్ ని అడుగడుగునా ప్రశ్నిస్తున్నారు అని మంత్రి నిలదీశారు.

బీజేపీ చేసేవి తొండి పనులు, జనాన్ని మోసం చేస్తారు. దళిత బంధు ఇవ్వండి, కేంద్రంలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నం. కాంగ్రెస్ మోసం ఎవ్వరూ మర్చిపోరు. తాగు నీళ్ళు కూడా ఇవ్వలేదు నాడు. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ లో పవర్ హాలిడేలు ఉన్నాయి. దేశంలో పవర్ హాలిడే లేని ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని మంత్రి హరీష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి, టిఎస్ఎంఎస్ఐడిసి ఛైర్మెన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

