తెలంగాణ కాంగ్రెస్, బిజెపి నేతలు నాలుకకు నరం లేకుండా మాట్లాడుతారు అని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గురువారం ఆయన నిర్మల్ జిల్లా ముథోల్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి వేణు గోపాలచారి, నిర్మల్ టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. బాసర అమ్మవారి దర్శనం చేసుకొని కార్యక్రమాలు మొదలు పెట్టాము. స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి మంచి నాయకుడు. బాగా పని చేస్తారు. ఆయన కోరిక మేరకు బాసరకు 24 గంటల్లో అంబులెన్స్ ఏర్పాటు చేస్తా అని చెప్పాను. తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. కేంద్ర ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే..తెలంగాణ కాంగ్రెస్, బిజెపి నేతలు నాలుకకు నరం లేకుండా మాట్లాడుతారు.
పక్కనే ఉన్న మహారాష్ట్రలో కల్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, 2016 ఆసరా పింఛన్లు, 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారా..? అక్కడే కాదు కాంగ్రెస్, బీజీపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలు చేస్తున్నారా..? దమ్ముంటే చర్చకు రావాలి మంత్రి సవాల్ చేశారు. దేశంలో 24 గంటల పాటు ఉచితంగా కరెంట్ ఇచ్చే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరే. ప్రధాని సొంత రాష్ట్రం అయిన గుజరాత్ లో ఎందుకు ఇవ్వడం లేదు.. మాట్లాడితే దేశ భక్తులు అంటారు.. మన ముఖ్యమంత్రి చేసినట్టు దేవాలయాలు, చర్చీలు, మజీద్ లు అభివృద్ధి చేశారా..పశ్నించారు. రు. 50 వేల కోట్ల రైతు బందు అందించిన ఒకే ఒక్క సీఎం కేసీఆర్.. ప్రభుత్వ ఆదాయం తగ్గినా.. ఫోన్లు టింగ్ టింగ్ టింగ్ మంటూ మోగుతున్నాయి. ధరఖాస్తు లేదు.. దస్టర్ లేదు.. అని తెలిపారు.
కేంద్రంలో ఝూటే బాజీ సర్కార్ పాలన కొనసాగుతుంది. పెట్రోల్, డీజిల్, ఎరువులు, వంట గ్యాస్ ధరలు పెంచిన కేంద్ర ప్రభుత్వం ప్రజల నడ్డి విరుస్తుంది. విద్యుత్ సంస్కరణల పేరిట తెలంగాణ ప్రభుత్వాన్ని మభ్యపెడుతుంది. ఐదేళ్లలో రూ.25 వేల కోట్లు ఇస్తామంటూ రైతుల బావుల దగ్గర మీటర్లు పెట్టుకుంటుంది. ఒక పూట ఉపాసాం ఉంటాం కానీ రైతులకు అన్యాయం చేసేది లేదని సీఎం కేసీఆర్ చెప్పేశారు. రాష్ట్రంలో యాసంగి వడ్లను కొనకుండా మోసం చేసింది.బడ్జెట్లో రూ . 25 వేల కోట్ల ఉపాధి నిధుల్లో కోత విధించిందని మంత్రి విమర్శించారు.
బీజెపీ నాయకులు మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు.మనకు విద్వేషాలు కొట్లాటలు ముఖ్యం కాదు. గలగల పారే గోదావరి జలాలు కావాలి. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తెలంగాణ మూడవ స్థానంలో ఉంది. బీజేపీ పాలనలో ఉన్న గుజరాత్ చివరిలో నిలిచింది. కరోనా సమయంలో మెరుగైన సేవలను తెలంగాణ అందించినట్లు పదిహేనో ఆర్థిక సంఘం వెల్లడించింది. యూపీలో ఈనెల 10న ఎన్నికలు ముగిసిన వెంటనే కేంద్రంలోని బీజేపీ పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలు పెంచనుంది మంత్రి హరీష్ వ్యాఖ్యనించారు.