బీజేపీ రెచ్చగొట్టే ప్రకటనలకు మోసపోవద్దు- మంత్రి

56
minister harish

హైదరాబాద్‌లోని హోటల్ టూరిజం ప్లాజాలో మహబూబ్‌న‌గ‌ర్‌-రంగారెడ్డి-హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల టీఆర్ఎస్‌ అభ్యర్థి ఎస్‌.వాణి దేవికి మద్దతుగా పట్టభద్రుల గెట్ టు గెదర్ సమావేశం జ‌రిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక‌ శాఖ మంత్రి హరీష్ రావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన‌ప‌ల్లి వినోద్ కుమార్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్ మాట్లాడుతూ.. ఎన్నికలు, ఓట్లు ఎప్పుడూ వ‌స్తుంటాయి. ప్రజాస్వామ్యంలో ఎందుకు ఓటు వేస్తున్నామో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. డా.బి.ఆర్.అంబేద్క‌ర్ రచించిన రాజ్యాంగం వల్ల మనందరం ఇవాళ‌ ఇక్కడ ఉన్నాం. కానీ ఈరోజు అంబేద్క‌ర్ రచించిన రాజ్యాంగాన్ని సవరించే కుట్ర జరుగుతోంది. రాజ్యాంగం క‌ల్పించిన హక్కులు కాలరాసే ప్రయత్నం జరుగుతుంది. అదే జరిగితే వందేళ్లు వెనక్కి పోతామ‌ని మంత్రి హ‌రీశ్‌రావు అన్నారు.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం ప్రభుత్వ రంగ సంస్థలల‌ను ప్రైవేటు ప‌రం చేస్తుంది. ప్రభుత్వరంగ సంస్థలు తొలగించేందుకు ఏకంగా ఓ మంత్రిత్వశాఖ‌నే పెట్టారు. ప్రభుత్వరంగ సంస్థల ఏర్పాటుకు మంత్రిత్వశాఖ అవసరం కానీ వాటిని తొలగించే శాఖ ఏర్పాటు బీజేపీ ఘనతే. ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు పరం అయితే మన హక్కులు, రిజర్వేషన్లు ఉండవు. ఎస్సీ, ఎస్టీల‌కు అన్యాయం జరుగుతుంది. ఇది అందరూ ఆలోచించాలి. వారసత్వ సంపదగా ఎన్నో కంపెనీలు ఉన్నాయి. కానీ వాటిని బీజేపీ ప్రభుత్వం అమ్మేస్తోందని మంత్రి విమర్శించారు.

కేంద్ర ప్రభుత్వం విధానాలపై అంతా ఆలోచించాల‌న్నారు. అంబేద్క‌ర్ చెప్పినట్టు సమీకరించు, బోధించు, పోరాడు అన్న సిద్ధాంతం మేరకు పనిచేయాలన్నారు. బీజేపీ రెచ్చగొట్టే ప్రకటనలకు మోసపోవద్ద‌న్నారు. మాయమాటలు నమ్మోద్దు. గాయి గత్తర చేసే ప్రయత్నం చేస్తారు. ఎస్సీ, ఎస్టీల‌కు రిజర్వేషన్లు తెచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల పోటీలో ఉన్న 93 మందిలో ఒకే ఒక్క మహిళ. మహిళలంద‌రూ వాణి దేవికి ఓటేసి చట్ట సభకు పంపించాలి. ఎమ్మెల్సీ అభ్యర్థి‌ వాణి దేవి నిగర్వి. లక్ష మంది గ్రాడ్యుయేట్ లను తయారు చేశారు. వాణీదేవికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా మంత్రి హ‌రీష్‌ రావు కోరారు.