కేంద్రం తెచ్చిన కొత్త సాగు చట్టాలు తేనె పూసిన కత్తి లాంటివి.. ఈ చట్టాలు రైతుల నడ్డి విరిచే విధంగా ఉన్నాయని ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీష్ రావు అన్నారు. తుఫ్రాన్ వద్ద రైతులకు మద్దతుగా నిర్వహించిన నిరసన ర్యాలీలో హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మంత్రి హరీష్ రావు తేల్చిచెప్పారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఊరురా తీర్మానాలు చేయాలన్నారు. 53 ఏళ్లుగా అమలవుతున్న మద్దతు ధరను బీజేపీ కాలరాస్తోందని మండిపడ్డారు. ఆనాడు లాల్ బహుదూర్ శాస్త్రి, బాబూ జగ్జీవన్ రాం తెచ్చిన మద్దతు ధర విధానానికి మోదీ ప్రభుత్వం పంగనామాలు పెట్టిందని ధ్వజమెత్తారు. స్వామినాథన్ కమిటీ సిఫారాసుల ఆధారంగా రైతు పెట్టుబడితో పాటు 50 శాతం మార్జిన్ కింద మద్ధతు ధర నిర్ణయించాలని సూచిస్తే.. ఉన్న ధర బీజేపీ ఊడగొడుతోంది.
సన్నరకాల రైతులకు అన్యాయం జరిగేలా కేంద్రం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఉసురు తగిలి బీజేపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందన్నారు. దేశంలో 23 పంటలను మద్దతు ధరకు కొంటున్నారు. మద్దతు ధరలు పెంచాలని రైతులు కోరుతున్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం అసలు మద్దతు ధర లేకుండా చేస్తుందని మండిపడ్డారు. రైతులు గొంతెమ్మ కోరికలు కోరట్లేదు.. వారి జీవితాలను నాశనం చేయొద్దు అని హరీష్ రావు పేర్కొన్నారు. కొందరు బీజేపీ నేతలు సాగు చట్టాలు ఒక విప్లవం అంటున్నారు.. కానీ ఆ చట్టాలు రైతుల వినాశనానికి దారి తీస్తాయని పేర్కొన్నారు. లాఠీ దెబ్బలు, వాటర్ క్యానన్‌లతో నీరు కొడుతుంటే రైతులు, ఆడవారు, చిన్న పిల్లలు ఎదురొడ్డి చలిలో నిరసన చేస్తుంటే బ్రిటన్ ప్రధాని, బీబీసీ న్యూస్ స్పందించింది కాని బీజేపీ ప్రభుత్వం స్పందించడం లేదు అని మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు.