మనం ప్రజలకు సేవకులం.. ప్రజలకు జీతగాళ్లం..!

85
harish
- Advertisement -

నార్మల్ డెలివరీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని భూంపల్లి పీహెచ్ సీ నూతన భవన శంకుస్థాపనలో వైద్యాధికారులు, సిబ్బందికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు మార్గదర్శనం చేశారు. మనమంతా జీతగాళ్లం.. నేనైనా.. నువ్వైనా.. ప్రజలకు జీతగాళ్లం. కాబట్టి మనం సేవ చేయాలి. మన పేర్లు వేరు ఒక్కరు ఆశా, ఒకరు ఏఎన్ఏం, ఒకరు ఏంపీ, ఒకరు మంత్రి కావొచ్చు. కానీ నా జీతం 2 లక్షలు. స్టాఫ్ నర్సుగా నీ జీతం 77 వేలు అన్నారు. నెలలో ఒక్క కాన్పు చేస్తే ఎట్లా. నార్మల్ డెలివరీ చేయడానికి స్టాఫ్ నర్సు చాలు. భద్రాచలంలో వైద్యుడు లేకుండానే ఒక్కరే స్టాఫ్ నర్సు రోజుకు 20 డెలివరీలు చేస్తున్నారు. మనం కూడా నార్మల్ డెలివరీలు చేయాలి అని మంత్రి హరీష్‌ సూచించారు.

గురువారం సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని భూంపల్లి పీహెచ్ సీ నూతన భవన నిర్మాణ పనులకు మెదక్ ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావులతో కలసి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు శంకుస్థాపన చేశారు. ఈ మేరకు అక్కడి వైద్య అధికారులు, సిబ్బందితో మంత్రి మాటామంతి కలిపి అవసరం లేకున్నా.. ఆపరేషన్ చేయడం వద్దు. నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు. ఎంత కడుపు కోత అవుతుందో.. మీకు తెలియడం లేదు, మన ప్రజల్ని మనం కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ప్రజలతో మమేకంగా ఉండాల్సిన వాళ్ళం మనమే కదా. మనమే వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలని మంత్రి హరీష్‌ రావు సూచించారు. కరోనా సమయంలో చాలా కష్టపడి పని చేశారు, బీపీ కంట్రోల్ చేయకపోతే కిడ్నీలు పాడవుతున్నాయని, షుగర్ మందులు, బీపీ మందులు ఉచితంగా అందిస్తున్నాం అన్నారు.

పెద్ద ఆపరేషన్ చేసి, గర్భసంచి తీసే వ్యాపారం చేయొద్దని, దాన్ని కూడా బంద్ చేయించాలని, అర్థమయ్యేలా చెప్పాల్సిన వాళ్ళు మీరే కాబట్టి సాటి మహిళా ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత తీసుకుని ప్రభుత్వానికి, మీకు మీరు మంచి పేరు తెచ్చుకోవాలి మంత్రి సూచించారు. పీహెచ్ సీ వైద్య అధికార సిబ్బంది వారీగా అక్కడికక్కడే సమీక్షిస్తూ.. ముగ్గురు ఉంటే.. మీ ఓపీ 21 ఉండటమేంటనీ ఆరా తీశారు. ఈ లెక్కన మీ విధులు ఏ పాటి నిర్వర్తిస్తున్నారో.. అర్థం అవుతున్నదని మంత్రి మండిపడ్డారు. రాత్రి పూట ఎవరైనా ఉంటున్నారా అని అడిగితే అక్కడున్న వారిని మంత్రి అడగ్గా.. ముగ్గురు స్టాఫ్ నర్సులు ఉన్నారని రాత్రిపూట ఎవరూ ఉండటం లేదనే ఫిర్యాదు చేశారు. పాముకాటు, తేలు కాటు మందులు ఉన్నాయా..?సూదులు ఉన్నాయా..? కుక్కకాటుకు ఎవరైనా వస్తే వెంటనే ట్రీట్మెంట్ అందిస్తున్నారా.. ఫ్రిజ్‌లో మందులు ఉన్నాయా.. చూడమంటరా..? అని మంత్రి ఆరా తీస్తూ.. పేషేంట్లు తక్కువ ఉద్యోగులెక్కువ.. 21 మంది స్టాఫ్ కు 21 మంది పేషేంట్లు ఉంటారా అని ప్రశ్నించారు.. గత నెలలో ముగ్గురు స్టాఫ్ నర్సులు ఒకే కాన్పు చేయడమేంటనీ సిబ్బందిని ప్రశ్నించారు మంత్రి హరీష్‌ రావు.

- Advertisement -