సిద్ధిపేట జిల్లాలోని మల్లనసాగర్, తపాస్ పల్లి, గండిపల్లి రిజర్వాయర్లు, కాల్వలు, పిల్ల కాల్వలపై సోమవారం మధ్యాహ్నం చందలాపూర్ రంగనాయక సాగర్ ఇరిగేషన్ కార్యాలయంలో ఇరిగేషన్ అధికారులతో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో కాళేశ్వరం ప్రాజెక్టు ఈఎన్సీ హరిరామ్, ఎస్ఈ ఆనంద్, తపాస్ పల్లి ఎస్ఈ సుధాకర్ రెడ్డి, డిప్యూటీ ఈఈ రవీందర్ రెడ్డి, ఇరిగేషన్ అధికారిక సిబ్బంది పాల్గొన్నారు.
సిద్ధిపేట, దుబ్బాక నియోజక వర్గాల్లో కాల్వలు, పిల్ల కాల్వల భూ సేకరణ ప్రక్రియపై ఇరిగేషన్ అధికారులతో మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఇంజినీర్ ఆలోచనతో పాటు ప్రజలకు ఏం కావాలో, స్థానిక ప్రజలుగా ఆలోచన చేస్తే.. ప్రజలకు శాశ్వతంగా నీటి వనరులు లభిస్తాయని, ఆ దిశగా ఇరిగేషన్ అధికారులు పని చేయాలని మంత్రి ఆదేశించారు.
కాల్వల ద్వారా ఎత్తుగా ఉండే ప్రాంతాలకు సాగునీరు అందే విధంగా లిఫ్టు అంశంపై అధికారులతో మంత్రి చర్చించారు. మల్లన్న సాగర్, రంగనాయక సాగర్ కాల్వలు, పిల్ల కాల్వలు, ఆయకట్టు కింద వచ్చే చెరువులు, కుంటలపై అధికారులతో మంత్రి హరీష్ రావు సుదీర్ఘ సమీక్షించారు. రైతులకు ఉపయోగ పడే విధంగా గ్రామాల్లో పిల్ల కాలువలు నిర్మించాలని ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు మంత్రి హరీష్.