తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి హరీశ్ రావు ప్రసంగిస్తూ విపక్షాలపై మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. పదవులు శాశ్వతం కాదు..రాష్ట్రం శాశ్వతం అని అన్నారు. రాష్ట్ర హక్కులకు భంగం కలిగేలా సంజయ్ వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ఓ జాతీయ ప్రాజెక్టు తెస్తే..నిండు సభలో సన్మానం చేస్తామని పేర్కొన్నారు.
సాగునీటి ప్రాజెక్టులపై దుష్ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం పలు ప్రాజెక్టుల డీపీఆర్ లను కేంద్రానికి సమర్పించలేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. అసలు, డీపీఆర్ లు ఇవ్వకుండానే ప్రాజెక్టులకు సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) అనుమతి ఇస్తుందా? అని ప్రశ్నించారు. డీపీఆర్ లు సమర్పించకుండానే పర్యావరణ అనుమతులు వస్తాయా? అని అడిగారు. పలు విభాగాల కార్యదర్శులు ఉండే టీఏసీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు.
“విపక్ష నేతలు ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే నిజమవుతుందని భావిస్తూ అసత్య ప్రచారం చేయడం బాధాకరం. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం పెరిగిందని, అంచనాలు తప్పాయని అంటున్నారు. 1954లో రూ.122 కోట్లతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి సాగర్ ప్రాజెక్టు విలువ రూ.1,183 కోట్లు. 8.7 రెట్లు వ్యయం పెరిగింది. 1964లో రూ.40 కోట్లతో ప్రారంభమైన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తయ్యేనాటికి దాని వ్యయం రూ.4,300 కోట్లకు చేరింది. 106 రెట్లు వ్యయం పెరిగింది. జూరాల ప్రాజెక్టు 1980లో రూ.70 కోట్లతో ప్రారంభమైంది. పూర్తయ్యేనాటికి దాని వ్యయం రూ.1,815 కోట్లు. దీని వ్యయం 25 రెట్లు పెరిగింది” అని వివరించారు.
కానీ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అంచనాలు పెరిగితే విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని అన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావిస్తూ… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అంచనాలు పెంచిందని ప్రశ్నించారు. అంచనాలు పెంచుతూ వరుసగా జీవోలు ఇచ్చింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? అని నిలదీశారు.
‘నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం నడిచింది. నీటిపారుదల రంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. సాగునీటి రంగంలో తెలంగాణ ప్రభుత్వం ఎన్నో విజయాలు సాధించింది. మండుటెండల్లో చెరువులు మత్తడి దుంకుతున్నాయి. యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల విలువ లక్ష కోట్లు దాటింది. ప్రాజెక్టులను రీ డిజైనింగ్ చేస్తున్నాం. మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్దరించుకున్నాం. వాగులపై చెక్‌డ్యాంలను నిర్మిస్తున్నాం. ఆసియాలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టు అని మంత్రి పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ చెరువులను పట్టించుకోలేదు. చెరువుల కింద 15లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరణ చేశాం. ఏపీ అక్రమ ప్రాజెక్టులపై అపెక్స్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేశాం. ఏపీ అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని’ హరీశ్ రావు చెప్పారు.