గురువారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం వద్ద 10 వేల మందితో మంత్రి హరీశ్‌రావు నిరసనదీక్ష చేపట్టారు. ఈ దీక్షలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు, ప్రజాప్రతినిధులు, భారీ ఎత్తున్న రైతులు పాల్గొన్నారు. నిరసనదీక్ష కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, నాడు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి సాధించుకున్నామని..నేడు తెలంగాణ రైతుల కోసం మళ్లీ రోడ్డెక్కామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మనం అడుగుతన్నది గొంతెమ్మ కోరిక కాదని, రైతుల కోసం చేస్తున్న ధర్మపోరాటమని చెప్పారు. నాడు కేంద్రంలోని అన్ని ప్రభుత్వాలు ఎలాంటి ఆంక్షలు లేకుండా వడ్లు కొన్నాయని తెలిపారు. మోడీ సర్కారు ఇప్పుడే ఎందుకు ధాన్యం కొనబోనని మొండికేస్తుందో తెలియడం లేదన్నారు. కేంద్ర సర్కారు లాభనష్టాలు బేరీజు వేసుకుని ప్రైవేట్ కంపెనీ లిమిటెడ్ కంపెనీలాగా పనిచేస్తున్నదని మండిపడ్డారు. ప్రధాని నరేంద్ర మోడీ.. అచ్చే దిన్ అని చెప్పి సచ్చే దిన్ తీసుకొచ్చారని విమర్శించారు.
ప్రజలనుంచి లాక్కోవడమే తప్పా ఇవ్వడం లేదని మండిపడ్డారు.వడ్లు కొనకుండా రైతులను కాల్చుకు తింటున్న కేంద్ర సర్కారుకు తగిన బుద్ధి చెప్తామని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మన్ కీ బాత్ కాదు..ముందు తమ రైతుల బాధలు వినాలని మోడీని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం.. పండిన వడ్లు కొనే బాధ్యత కేంద్రానిదేనన్నారు. తెలంగాణలో పండిన ప్రతి గింజనూ కొనాల్సిందేనని, వాటిని బాయిల్డ్ చేసుకుంటారా? నూకలు చేసుకుంటారా? సన్నబియ్యంగా మార్చుకుంటారా? అనేది కేంద్రం ఇష్టమని చెప్పారు. వడ్లను విదేశాలకు ఎగుమతి చేయాలన్నా అది కేంద్రమే చేయాలని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.