రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సమాక్షంలో ఆదివారం దుబ్బాకలో పలువురు బీజేపీ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి హరీష్ గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అబద్ధాలతో అధికారంలోకి బీజేపీ రావాలనుకుంటే అది ఎండమావేనని ఎద్దేవ చేశారు. బీడీ కార్మికులకు రూ.1600 ఇస్తున్నట్లు బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని, 16 పైసలు కార్మికులకు నరేంద్ర మోదీ ఇస్తున్నట్లు ఆధారాలు చూపాలని మంత్రి డిమాండ్ చేశారు. గుజరాత్ సహా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీడీ కార్మికులకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.
యూపీలో వృద్ధులకు, వితంతువులకు బీజేపీ రూ.500 ఇస్తుందని పేర్కొన్నారు. అలాగే కర్ణాటకలో రూ.400 పెన్షన్ బీజేపీ ప్రభుత్వం ఇస్తుందని, తెలంగాణలో రూ.2వేలు ఇస్తున్నట్లు గుర్తు చేశారు. బీజేపీవి అన్నీ దోకాబాజీ మాటలేనన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాజస్థాన్లో రూ.500 మాత్రమే పింఛన్ ఇస్తున్నారని, రూ.2వేల పింఛన్ ఇచ్చే టీఆర్స్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్, బీజేపీ ఎలా విమర్శిస్తున్నాయని ప్రశ్నించారు.
యూపీలో బోర్లు, బావులదగ్గర యూనిట్ రూ.4 చొప్పున రైతుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజల సంక్షేమానికి పథకాలు అమలు చేస్తుందన్నారు. గోబెల్స్ ప్రచారాన్ని నమ్ముకొని బీజేపీ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని మంత్రి విమర్శించారు. త్వరలో జరుగబోయే దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత గెలుపు ఖాయమన్నారు. ఆమె గెలుపునకు కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి హరీష్ పేర్కొన్నారు.