బండి సంజయ్‌కి మంత్రి హరీష్‌ రావు సవాల్‌..

63
- Advertisement -

హైదారాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ కాదు.. దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ పెట్టులని బండి సంజయ్‌కి రాష్ట్ర ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరారు…దేశ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు తరలి వచ్చి పోరాటం చేస్తరు అని బీజేపీపై మంత్రి తీవ్రంగా మండిపడ్డారు. శనివారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా జిల్లాలో నూతన మెడికల్‌, నర్సింగ్‌ కాలేజీ పనులను పరిశీలించారు. అనంతరం మంత్రి హరీష్‌ మీడియాతో మాట్లాడారు.

ఉద్యోగాలు.. ఉద్యోగాలు అని బీజేపీ నేత‌లు దొంగ జ‌పం చేస్తున్నారు. దొంగే దొంగ అంటున్న‌రు. అస‌లు ఉద్యోగాలు ఇచ్చింది ఎవ‌రు…? ఇవ్వంది ఎవరు..? నోటిఫికేష‌న్లు ఇచ్చింది ఎవ‌రు.. నోటిఫికేష‌న్లు ఇవ్వనిది ఎవ‌రు..? రాష్ట్రంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా.. దేశంలో నిరుద్యోగం ఎక్కువ ఉందా….? బండి సంజ‌య్ అండ్ బ్యాచ్ ద‌మ్ముంటే స‌మాధానం చెప్పాలని మంత్రి డిమాండ్‌ చేశారు.. గాలి మాట‌లు కాదు..ఉద్యోగాలు ఇస్తే గ‌ణాంకాలు చెప్పాలి…మీ బిజెపి హయాంలో దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో శ్వేత పత్రం విడుదల చేయాలి. నోటికి వ‌చ్చిన‌ట్లు, ఇష్టం వ‌చ్చిన‌ట్లు మాట్లాడి త‌ప్పుడు ప్ర‌చారం చేస్తే ఉద్యోగాలు ఇచ్చిన‌ట్లు అవుతుందా.. నోటిఫికేష‌న్లు ఇచ్చిన‌ట్లు అవుతుందా…అని ప్రశ్నించారు. బీజేపీ పాల‌న‌లో దేశంలో నిరుద్యోగం ఎంత పెరిగిందో.. నిరుద్యోగ యువత ఎంత బాధ ప‌డుతుందో బండి సంజ‌య్ తెలుసుకోవాలి..హైదారాబాద్ గల్లీలో మిలియన్ మార్చ్ చేయడం కాదు.. బండి సంజయ్…దమ్ముంటే ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేయాలి ఎద్దేవ చేశారు.

తెలంగాణ ఏర్పాటు త‌ర్వాత నియామ‌కాలకు తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్రాధాన్యం ఇచ్చింది. టీఎస్‌పీఎస్సీ, పోలీసు, సింగ‌రేణి, గురుకులాలు, విద్యుత్‌, మెడిక‌ల్ హెల్త్ త‌దిత‌ర విభాగాల్లో మొత్తం 1,32,899 ఉద్యోగాల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది. ఒక్క టీఎస్‌పీఎస్సీ ద్వారానే 30,594 పోస్టుల‌ను ప్ర‌భుత్వం భ‌ర్తీ చేసింది. తెలంగాణ స్టేట్ లెవ‌ల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా 31,972 పోస్టులు, జూనియ‌ర్ పంచాయ‌తీ సెక్రెట‌రీలు 9,355, సింగ‌రేణి కాల‌రీస్ కంపెనీ లిమిటెడ్ 12,500, విద్యుత్ సంస్థ‌ల ద్వారా 6,648, డీసీసీబీలు 1571, టీఆర్‌టీ ద్వారా 8792, గురుకులాల్లో 11,500 టీచ‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసింది. మ‌రో 50 నుంచి 60వేల పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు క‌స‌రత్తు చేస్తున్న‌ది. ఉమ్మ‌డి ఏపీలో అమ‌ల్లో ఉన్న‌ప్ప‌టి నాన్ లోక‌ల్ విధానాన్ని ర‌ద్దు చేసి తెలంగాణ ప్ర‌జ‌ల‌కే వంద శాతం ఉద్యోగాలు ద‌క్కేలా చ‌ర్య‌లు చేప‌ట్టింది. 95శాతం ఉద్యోగాలు స్థానికుల‌కు ల‌భించేలా కొత్త జోన‌ల్ విధానాన్ని తీసుకువచ్చారు. దీనికి గాను 317 జీవోను విడుదల చేయడం జరిగింది. ఈ ప్రక్రియ పూర్త‌యితే దీని ప్ర‌కారం, కొత్త ఖాళీలు గుర్తించి, నోటిఫికేష‌న్లు ఇచ్చేందుకు ప్ర‌భుత్వం ప్ర‌ణాళిక‌తో ఉంది.

అయితే దీన్ని అడ్డుకునేందుకు బీజేపీ అనేక కుట్ర‌లు ప‌న్నుతున్న‌ది. తెలంగాణ స్థానిక యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాలు ద‌క్క‌కుండా చేస్తున్న‌ది. మీ ప్రభుత్వం హయాంలో… రాష్ట్రపతి ఉత్తర్వుల స్పిరిట్ తో, రాష్ట్రపతి నిబంధనలకు లోబడి జీఓ నెంబర్ 317 వచ్చింది. అలాంటి దానిపై బిజెపి నేతలు వ్యతిరేకంగా మాట్లాడటం అంటే.. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి, విమర్శలు చేయడమే. తెలంగాణలో ఒక్క ఖాళీ లేకుండా ఉండాలని, అన్ని జిల్లాల యువత ఉద్యోగ అవకాశాలు లభించాలన్నదే సిఎం కేసీఆర్ ఆకాంక్ష. దీనిని అడ్డుకునేందుకే బీజేపీ చిన్న విషయాన్ని భూతద్దంలో చూపెట్టి ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య చిచ్చుపెట్టి, ఆ మంటలో చలి కాచుకుంటున్నది. అలా చేస్తే రాజకీయ లబ్ధి జరుగుతుంది అనుకుంటే వంద శాతం మోసపొయినట్టే… బండి సంజయ్ నీ గోబెల్స్ ప్రచారాన్ని ఎవరు నమ్మరు.బిజేపీ నాయకులకు తెలంగాణలో ఉద్యోగ అవకాశాలు.. నోటిఫికేషన్ల గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది. బిజెపి ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నది. నిరుద్యోగ భారత్ గా చేస్తున్నది..ఈ విషయాన్ని ప్రముఖ విశ్లేషణ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి 20న CMIE వెల్లడించింది. దేశంలో కోట్లాదిమంది నిరుద్యోగులు పొట్టచేత పట్టుకుని తిరుగుతున్నారు. గత నెల డిసెంబర్‌ నాటికి 5.3 కోట్ల మందికి ఉద్యోగం, ఉపాధి లేదని సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎంఐఈ) తాజాగా తెలిపింది.

‘ప్రపంచ ఉపాధి రేటు ప్రమాణాలను భారత్‌ అందుకోవాలంటే అదనంగా 18.75 కోట్ల మందికి ఉద్యోగాలను కల్పించాల్సి ఉంటుంది’ అని సీఎంఐఈ స్పష్టం చేసింది.. దేశంలో, తెలంగాణలో నిరుద్యోగం ఎంత ఉందో కూడా వివరించింది. జాతీయ నిరుద్యోగ శాతం కంటే తెలంగాణలో నిరుద్యోగ శాతం మూడు రెట్లు తక్కువ అని ఇది స్పష్టం చేసింది. దేశంలో నిరుద్యోగం శాత 7.91% ఉంటే తెలంగాణలో 2.2% మాత్రమే ఉంది అని వెల్లడించింది. నిరుద్యోగ రేటు తక్కువగా ఉన్న 5 రాష్ట్రాల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. పోనీ దేశంలో ఉద్యోగాలు ఖాళీ లేవా అంటే లేనట్టు కాదు.. కేంద్రం లెక్కల్లో 15 లక్షల 62 వేల 962 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. అర్మీలో 2 లక్షలు, రైల్వేల్లో మూడు లక్షలు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 41,177 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దమ్ముంటే అవి భర్తీ చేయమని మోడీ ఇంటి ముందు ధర్నా చేయండి. దేశ యువత కోసం పోరాటం చేయండి. ఢిల్లీలో బిలియన్ మార్చ్ చేయండి…అని మంత్రి హరీష్‌ హితవు పలికారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బిజెపి.. గత 7 ఏళ్లలో 14 కోట్ల ఉద్యోగాల లెక్క చెప్పాలి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 2019 ఫిబ్రవరి 23 న 1,03,769 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఉద్యోగం వస్తుందనే ఆశతో దేశవ్యాప్తంగా దాదాపు కోటి మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. మూడు సంవత్సరాలు కావస్తున్నా పరీక్ష పూర్తి చేయలేదు.

నిరుద్యోగ దీక్ష పేరుతో రాష్ట్రంలో దొంగ దీక్షలు చేస్తున్న బీజేపీ నేతలకు కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసే దమ్ము ఉందా?. ఈ కోటి మంది నిరుద్యోగుల కోసం వారు ఎక్కడ దీక్ష చేస్తారో చెప్పాలి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుంటే.. బిజెపి నేతల కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో బంగారు తెలంగాణ కల సాకారం అవుతుంటే… కేంద్రంలోని బిజెపి దేశాన్ని నిరుద్యోగ భారత్ గా మార్చుతుంది.

ఏ రాష్ట్రంలో ఎంత జనాభా… ఎంత మంది ఉద్యోగులు…

మొత్తం జనాభాలో ఎంత శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు? అని చూస్తే.. దేశంలో తెలంగాణ ముందు వరుసలో ఉన్నది. తెలంగాణ జనాభాలో 3% మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. బీహార్ లో 0.3 %, యూపీ లో 1%, బెంగాల్ 1.1%, గుజరాత్ 1.1 %, కర్ణాటక 1.2%, తమిళనాడు 2% జనాభా ప్రభుత్వ ఉద్యోగులు గా ఉన్నారు. అనేక రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందు వరుసలో ఉన్నదని ఈ గణాంకాలు చెప్తున్నాయి. అంతేకాదు తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న జీతాలు అనేక రాష్ట్రాల కన్నా ఎక్కువ. కేంద్రం ఇప్పటికే అనేక సంస్థలను ప్రైవేట్ కు అమ్మేసింది. దీంతో వేల మంది రోడ్డున పడ్డారు. ఇప్పుడు LIC సహా అనేక కంపెనీల వాటాలను అమ్మెస్తోంది. ఎయిర్ ఇండియాను టాటాకి అప్పగించారు. కేంద్రం IDBI సహా 2 ప్రభుత్వ రంగ బ్యాంక్ లను ప్రైవేటికరణ చేస్తోంది. దీంతో వేలాది మంది రోడ్డున పడతారు. కేంద్రం విచ్చలవిడిగా ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం వల్ల దాదాపు రెండున్నర లక్షల మంది ఉద్యోగాలను కోల్పోయారు. ఆ కుటుంబాలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పగలరా. కేంద్రం చర్యలతో ఉద్యోగాలకు ఎసరు రావడంతో పాటు sc, st, obc, ews అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తరగతుల సాధికారత కోసం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లుకల్పించినప్పటికి, అన్నిటినీ ప్రైవేటు పరం చేయడం వల్ల రిజర్వేషన్లు కోల్పోవాల్సిన పరిస్థితి వస్తున్నది.

వాస్తవాలన్నీ ఇలా ఉంటే… మీరు చేసే గోబెల్స్ ప్రచారాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. దివలాకోరు మాటలను బీజెపీ నేతలు ఇకనైనా మానుకోవాలి. అసంబద్ధ, అవకాశ వాద, పసలేని ఆరోపణలతో బిజెపి చిల్లర రాజకీయాలు చేస్తున్నది.యువతకు ఉద్యోగాలు ఇస్తామంటే ఒప్పుకోరు, తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులోకి తెస్తామంటే ఓర్వరు, దళిత బంధు విషయంలో అడ్డగోలు ఆరోపణలు చేస్తారు.. ఎందుకంత అక్కసు మీకు..? అని మంత్రి ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అభివృద్ది చేయ‌రు.. ఇక్క‌డ మేం చేస్తే అడ్డుకుందామ‌ని చూస్త‌రు. పైగా కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎలాంటి నిధులు తీసుకురారు, విభ‌జ‌న హామీల నెర‌వేర్చేందుకు ప్ర‌య‌త్నించ‌రు. గోబెల్స్ ప్ర‌చారం చేసుకుంటూ.. రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని చూస్త‌రు ధ్వజమెత్తారు. తెలంగాణ విద్యార్థులను, నిరుద్యోగులను బిజెపి ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తున్నది. రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర విద్యా సంస్థలు రాకుండా తెలంగాణ ప్రాంతం పట్ల నిర్లక్ష్యం చూపుతున్నది. దేశంలో ఏడేళ్లలో కొత్తగా 7 ఐఐఐఎంలు కేటాయిస్తే అందులో తెలంగాణకు కేటాయించినవి సున్న.. ఐఐటీ లు 7 తెలంగాణకు కేటాయించినవి సున్న… ఐఐఐటీలు 16 ఏర్పాటు చేస్తే తెలంగాణకు కేటాయించినవి సున్న..157 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే తెలంగాణాకు ఇచ్చినవి సున్న.. 84 నవొదయలు ఏర్పాటు చేస్తే తెలంగాణాకు సున్న.. వీటిని రాష్ట్రానికి తెప్పించడంలో రాష్ట్రంలోని బీజీపీ ఎంపిల కృషి గుండు సున్నా….వాళ్ళు దేశ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వరు.. కేంద్రం నుండి తెలంగాణకు అన్యాయం చేస్తారు.. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు చేస్తూ..ఉన్న ఉద్యోగాలను లేకుండా చేస్తారు..తెలంగాణ ప్ర‌జ‌లారా ఇలాంటి వాళ్ల గోబెల్స్ ప్రచారాన్ని, వాట్సప్ ఫేక్ ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని మంత్రి హరీష్‌ రావు కోరారు.

- Advertisement -