హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో వైద్యారోగ్య శాఖ బలోపేతానికి సీఎం కేసీఆర్ నియమించిన కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు సంబంధిత అధికారులు పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ప్రజా సేవలో ఆరోగ్య శాఖ నిమగ్నమైందని స్పష్టం చేశారు. వైద్యారోగ్య శాఖ 365 రోజులు నిరంతరం పని చేసే శాఖ అని పేర్కొన్నారు. కొవిడ్ నేపథ్యంలో గత 6 నెలలుగా ప్రజలందరూ నివాసాలకు మాత్రమే పరిమితమైతే, ఆరోగ్య శాఖ మాత్రం ప్రజల ఆరోగ్యం కోసం శ్రమించిందని తెలిపారు. కరోనా ప్రభావంతో వైద్య శాఖను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ర్టంలో వైద్యారోగ్య శాఖను బలోపేతం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని మంత్రి గుర్తు చేశారు. ఈ క్రమంలో ఆ దిశగా ముందుకెళ్తున్నామని మంత్రి ఈటెల రాజేందర్ పేర్కొన్నారు.