రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదు- మంత్రి ఈటల

155
minister etala
- Advertisement -

ప్రతి పీహెచ్‌సీలో వ్యాక్సిన్‌ అందుబాటులో ఉండేలా చూస్తాం. ప్రస్తుతం రోజుకు లక్షన్నర మందికి వ్యాక్సిన్‌ ఇస్తున్నామని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఆయన ఆదివారం బీఆర్‌కే భవన్‌లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా తగ్గిందనుకున్న సమయంలో రెండో వేవ్‌ మొదలైందని అన్నారు. సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ బారినపడిన వారిలో 5 శాతం మందిలో మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ‘‘45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి, ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు 100 శాతం టీకాలు పంపిణీ చేస్తామని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి రోజుకు 10 లక్షల మందికి టీకా వేసే సామర్థ్యం ఉంది. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ కొరత సమస్యను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ దృష్టికి తీసుకెళ్లాం. కరోనా రోగులకు చికిత్సనందించే ప్రభుత్వ దవాఖానల్లో పడకల కొరత లేదని మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో 60వేల పడకలు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. వ్యాక్సిన్‌ కొరత కారణంగానే ఇవాళ పంపిణీ నిలిచిపోయింది. రాత్రి కల్లా 2.7 లక్షల డోసులు రాష్ట్రానికి రావచ్చని భావిస్తున్నాం. టీకా నిల్వలపై రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు, కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి తెలపారు.

సెకండ్‌ వేవ్‌లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉన్నందున ఆక్సిజన్‌ సరఫరా విషయంపైనా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. రాష్ట్రంలో నిత్యం 200 టన్నుల ఆక్సిజన్‌ అవసరం ఉంటుంది. కేసులు పెరిగితే 350 టన్నుల వరకు అవసరం ఉండొచ్చు. ఆక్సిజన్‌ సరఫరా విషయం కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరత లేదు. ప్రైవేట్‌, ప్రభుత్వ దవాఖానల వైద్యులు కరోనా రోగులకు ఐసీఎంఆర్‌ విధి విధానాలకు అనుగుణంగా వైద్యం అందించాలి. రోగి పరిస్థితి, అవసరాన్ని బట్టి ఆక్సీజన్‌ అందించాలి.. ఆక్సీజన్‌ కొరత లేకుండా చూడాల్సిన బాధ్యత సైతం వైద్యులపై ఉంది. ఆక్సిజన్‌ అవసరం మేరకు వాడుకోవాలి అని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు.

- Advertisement -