కరోనాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు- మంత్రి ఈటల

222
Minister Etela
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. రాష్ట్రంలో తొలి కరోనా వైరస్‌ కేసు నమోదైన నేపథ్యంలో ఈ రోజు నగరంలోని కోఠిలో సంబంధిత అధికారులు, అన్ని ఆస్పత్రుల సూపరింటెండెంట్లతో మంత్రి సమావేశమైయ్యారు. కరోనా సోకిన వ్యక్తికి గాంధీ ఆస్పత్రిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్సపై మంత్రి చర్చిస్తున్నారు. కాగా ఆదివారం రోజున దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఐదుగురికి కోవిడ్‌-19 పరీక్షలు జరపగా నలుగురికి నెగిటివ్‌గా తేలగా.. మరొకరికి పాజిటివ్‌ వచ్చినట్లు నిర్ధారించారు. వీరిని గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో ఉంచి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

మంత్రి ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడారు. బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్న 24 ఏళ్ల యువకుడు.. ఫిబ్రవరి 15న దుబాయ్‌ వెళ్లాడు. కంపెనీ పని నిమిత్తం దుబాయ్‌ వెళ్లిన ఆ ఉద్యోగి.. ఇతర దేశాలు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో కలిసి అక్కడ పని చేశాడు. ఫిబ్రవరి 20న తిరిగి బెంగళూరుకు చేరుకున్నాడు. 27న జ్వరం రావడంతో.. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. అదే రోజు సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్లు ట్రీట్‌మెంట్‌ చేసినప్పటికీ జ్వరం తగ్గకపోవడంతో గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్‌ వార్డులో టెస్టులు చేయించుకోవాలని సూచించారు. దీంతో మార్చి 1న సాయంత్రం 5 గంటలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. గాంధీ ఆస్పత్రిలో చేరాడు. అతనికి కరోనా టెస్టులు చేయగా పాజిటివ్‌గా ఫలితం వచ్చింది. నిర్ధారణ కోసం పుణెకు కూడా పంపించం.. అక్కడ కూడా పాజిటివ్‌ ఫలితాలే వచ్చాయి. ఇదే విషయాన్ని కేంద్రానికి తెలిపాం. ప్రస్తుతం బాధిత వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు.

ఇక బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ప్రయాణించిన బస్సులో మొత్తం 27 మంది ప్రయాణికులు ఉన్నారు. వారితో పాటు సికింద్రాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు, ఇతరుల వివరాలు తీసుకున్నాం. కుటుంబ సభ్యుల వివరాలను కూడా సేకరించాం. మొత్తంగా 80 మంది దాకా ఉన్నారు. వీరందరికి కరోనా టెస్టులు చేస్తామని మంత్రి తెలిపారు. వీరందరికి వైరస్‌ సోకినట్లు కాదు.. నిర్ధారణ కోసమే అని ఆయన చెప్పారు.

కాగా ప్రతి ఒక్కరూ బయటకు వెళ్లినప్పడు విధిగా ముక్కుకు గుడ్డ కట్టుకోవాలని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వ్యాధి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించి, టెస్టులు చేయించుకోవాలి. హైదరాబాద్‌లోని గాంధీ, చెస్ట్, ఫీవర్ ఆస్పత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసామని మంత్రి తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో దగ్గడం, తుమ్మడం లాంటివి చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలకు అవగాహన కల్పించేందుకు బ్రోచర్స్ ప్రింట్ చేసి జనసమ్మర్థ ప్రదేశాల్లో ఉంచుతాం. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు స్పెషల్‌ ఫండ్‌ అవసరమైన పక్షంలో తీసుకోండని సీఎం చెప్పారు’అని ఈటల పేర్కొన్నారు.

- Advertisement -