ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరోజే 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని, వీటితో పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరుకున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఒకరు మృతి చెందారని..మృతుల సంఖ్య 12కు చేరిందని మంత్రి వెల్లడించారు. ఈ రోజుకి మొత్తం 45 మంది డిశ్చార్జి కావడంతో రాష్ట్రంలో ప్రస్తుతం 414 యాక్టివ్ కేసులున్నాయని మంత్రి తెలిపారు. ఇక 471 పాజిటివ్ కేసుల్లో 385 మంది మర్కజ్ వెళ్లొచ్చిన వారు, వారిని కలిసిన వ్యక్తులు ఉన్నారని మంత్రి స్పష్టం చేశారు.
లాక్‌డౌన్ వల్ల రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గిందని.. లేదంటే వ్యాధి తీవ్రత మరింత ఎక్కువగా ఉండేదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రోగులు ఏప్రిల్ 22వ తేదీ వరకు కోలుకునే అవకాశం ఉందన్నారు. మర్కజ్ కేసులు లేకపోతే కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉండేదన్నారు మంత్రి. ఇక వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిలో 60 నుంచి 70 మంది శుక్రవారం డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందన్నారు.
ప్రజలందరూ స్వచ్ఛందంగా లాక్‌డౌన్ పాటించడం వల్లే కరోనా కేసులు తగ్గాయన్నారు. రేపట్నుంచి కరోనా కేసులు తగ్గే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. గురువారం ఒక్కరోజే 665 నమూనాలు పరీక్షిస్తే 18 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణలో 101 హాట్‌స్పాట్‌లను గుర్తించామన్నారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.