వ్యాక్సిన్‌పై అపోహలు వద్దు- మంత్రి ఈటెల

155
Minister Etela
- Advertisement -

జనవరి 16 నుండి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య‌శాఖ మంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్ పై అపోహలు, సందేహాలు అవసరంలేదని అన్నారు. వాక్సిన్ మానవ కల్యాణం కోసమే. భయపడవద్దు. శాస్త్రబద్దంగా అన్ని పరీక్షల తరువాతనే డీసీజీఐ వాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిందని తొలి టీకాను తానే వేయించుకోనున్న‌ట్లు మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ తెలిపారు.

భారత ప్రజానీకం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా వాక్సిన్ 16న ప్రారంభం కానున్న‌ట్లు తెలిపారు. మన రాష్ట్రంలో 139 కేంద్రాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. గాంధీ ఆసుపత్రిలో తాను, సీఎస్ సోమేష్ కుమార్, హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేష్ రెడ్డి పాల్గొంటున్నామ‌న్నారు. రాష్ట్రంలో మిగతా కేంద్రాల్లో స్థానికంగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు.

తొలివిడతలో 18 ఏళ్ల లోపు వారికి, గర్భవతులకు వ్యాక్సిన్ ఇవ్వడంలేదని అన్నారు. మొదటి విడతలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే వైద్య, పారిశుద్ధ్య సిబ్బందికి అందిస్తామని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే రెండో విడత వ్యాక్సిన్లను ప్రైవేటు ఆసుపత్రుల సిబ్బందికి అందిస్తామని చెప్పారు. 30 రోజుల వ్యవధిలో రెండు డోసులు ఇస్తామని, తొలి డోసు ఏ కంపెనీ వ్యాక్సిన్ వేయించుకున్నారో, రెండో డోసు కూడా అదే కంపెనీ వ్యాక్సిన్ వేయించుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. గాంధీ ఆసుపత్రిలో తాను కరోనా వ్యాక్సిన్ తీసుకుంటానని మంత్రి ఈటెల తెలిపారు.

- Advertisement -