ప్రభుత్వ పథకాలను ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేయాలి- మంత్రి

46
- Advertisement -

రాష్ట్రంలో నూటికి అరవై ఒక్క శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని అందువల్ల రాష్ట్రంలోని గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె ప్రగతి కింద 2019 సెప్టెంబర్ నుండి ఇప్పటి వరకు 8 వేల 6 వందల 29 కోట్ల రూపాయలు గ్రామీణ స్థానిక సంస్థలకు గ్రాంట్ గా విడుదల చేశామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో రూ.5.15 కోట్ల వ్యయంతో నిర్మించనున్న జిల్లా ప్రజా పరిషత్ నూతన భవన నిర్మాణపు పనులకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డితో కలసి శంకుస్థాపన చేసారు.

ఈ సందర్బంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ, కరోనా కాలంలో కూడా ఇతర రాష్ట్రాలు ఆపి వేయగా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ప్రతినెలా క్రమం తప్పకుండా పెన్షన్లు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా 1300 వందల కోట్లు నిధులను వికారాబాద్ జిల్లాకు కేటాయించి జిల్లాలోని అన్ని అవాసాలకు సురక్షితమైన తాగునీటి సదుపాయం కల్పించామని ఆయన తెలిపారు. ప్రభుత్వం అందించిన పథకాలు,నిధుల వివరాలు గ్రామ పంచాయతీ కార్యాలయాల ముందు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రచారం చేయాలని మంత్రి కోరారు. వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి 8 వేల కోట్ల రూపాయలు కేటాయించినట్లు ఆయన తెలిపారు.

వికారాబాద్ జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాలు చేపట్టడానికి జడ్పీటీసీలకు 15 లక్షలు విడుదల చేస్తున్నట్లు తెలియజేశారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా జిల్లాలోని తాండూర్ కు సీసీ రోడ్లు, పరిగి, కొడంగల్ లలో గ్రామాలకు గ్రామ పంచాయతీ భవనాలు మంజూరు చేయనున్నట్లు మంత్రి ప్రకటించారు. దీనికి తోడుగా వికారాబాద్ పట్టణంలో కూడా రోడ్ల నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చాలా అభివృద్ధి జరిగిందని, 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందించడం జరుగుతుందని తెలిపారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన వికారాబాద్ జిల్లాలో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు, టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్ళు వికారాబాద్ జిల్లాకు రానున్నాయని మంత్రి అన్నారు.

రాష్ట్రంలో గ్రామాల సమగ్ర అభివృద్ధికి సిఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రతి నెలా 227 కోట్ల 50 లక్షల రూపాయలను గ్రాంట్ గా గ్రామీణ స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని మంత్రి తెలిపారు. అందులో 210 కోట్ల 40 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీలకు 11 వేల 37 లక్షల రూపాయలు మండల పరిషత్ లకు, 5 కోట్ల 69 లక్షల రూపాయలు జిల్లా ప్రజా పరిషత్ లకు ప్రతినెలా గ్రాంట్ గా విడుదల చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి ఈ ఆర్ధిక సంవత్సరం రెండవ విడత నిధులు విడుదల కానప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్ధిక సంవత్సరంలో ఫిబ్రవరి వరకు ప్రతినెలా 227 కోట్ల 50 లక్షల రూపాయలను గ్రామీణ సంస్థలకు గ్రాంట్ గా విడుదల చేసిందని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా కేసీఆర్ లేకపోతే కొన్ని మైలు రాళ్లు రాష్ట్రం అందుకోక పోతుండేదని, తెలంగాణ సాధన ఆయనతోనే సాధ్యం అయిందని తెలిపారు. బంగారు తెలంగాణ నిర్మాణం ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమవుతుందన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ చరిత్రలో నిలిచిపోతుందని, ప్రపంచంలోనే అతి పెద్దదైన ఎత్తిపోతల పథకం కేవలం మూడేళ్ళ కాలంలో పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రంలో అన్ని గ్రామాలకు మంచినీటి సౌకర్యం కల్పించిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానిది అన్నారు. పల్లె ప్రగతి ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు గణనీయంగా అభివృద్ధి చెందాయాని అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగు నీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు ఆమె అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి స్వప్నం నెరవేరుతుందని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో వికారాబాద్ సస్యశ్యామలం అవుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రంజిత్ రెడ్డి ,ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్ ,కాలే యాదయ్య ,నరేందర్ రెడ్డి,రోహిత్ రెడ్డి,మహేశ్వర్ రెడ్డి ,ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ,కలెక్టర్ నిఖిల,రాష్ట్ర విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్ ,బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్ ,జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్ ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -