గురువారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం దేవరుప్పుల మండలం చిన్న మడూరులో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి పురస్కరించుకొని ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి పూల మాల వేసి, పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు మాట్లాడుతూ, రాజ్యాంగ రూపకర్తగా, న్యాయవాదిగా, ఆర్థిక శాస్త్రవేత్తగా, రాజకీయ నేతగా, సంఘ సంస్కర్తగా ఇలా అన్ని రంగాల్లో సేవ చేసిన మహనీయుడు అంబేడ్కర్. అంటరానితనం, కుల నిర్మూలనే లక్ష్యంగా అనేక ఉద్యమాలు చేసి ఎందరికో ఆదర్శంగా నిలిచారని మంత్రి కొనియాడారు.
ఆయన దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేశారు. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలుండాలని మొదట పోరాటం చేసింది అంబేద్కరే. తనకు జరిగిన అవమానం ఇంకెవరికి జరగొద్దని దేశ న్యాయ మంత్రి అయ్యాక… దళితులకు రిజర్వేషన్లను కల్పించింది కూడా అంబేద్కరే. మన దేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత పెద్ద రాజ్యాంగం. అలాంటి రాజ్యాంగాన్ని రాసి చరిత్రలో నిలిచిపోయారు అంబేడ్కర్. ఈ రోజు మనం ఈ ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నమంటే… ఆ పుణ్యం అంబేద్కర్ దే. అలాంటి మహోన్నతుడిని గుర్తు చేసుకుంటూ… ఈ రోజు ఆయన జయంతిని జరుపుకుంటున్నామన్నారు.
నిమ్న, నిరుపేద వర్గాలకు దేవుడు అంబేద్కర్. నేను ఎమ్మెల్యే, మంత్రి అయ్యానంటే అందుకు కారణం అంబేద్కరే అని గుర్తుకు చేసుకున్నారు. ఎస్సీ ల వర్గీకరణను, ఎస్టీల రిజర్వేషన్ లను కేంద్రం తొక్కి పెట్టింది. దేశంలో ఎక్కడా లేని పథకం దళిత బంధు 3 ఏళ్ళల్లో రాష్ట్రంలోని 17 లక్షల కుటుంబాలకు దళిత బంధు అందనుంది అన్నారు. ఉద్యోగాలు ఇస్తున్నాం..అనేక పథకాలు అమలు చేస్తున్నాం అని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా అదనపు కలెక్టర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, దళిత సంఘాల నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.