అన్ని గ్రామాలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం ప్రధాన ఉద్దేశంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రతి గ్రామానికి కచ్చితంగా తారు రోడ్డు ఉండాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రధాన్ మంత్రి గ్రామ సడక్ యోజన(పీఎంజీఎస్ వై) కింద కేంద్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేస్తున్న వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని రోడ్ల ప్రతిపాదనలపై మంత్రి దయాకర్‌రావు హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో పీఎంజీఎస్ వై రాష్ట్ర కార్యాలయం చీఫ్ ఇంజనీర్ ఎం.రాజశేఖర్ రెడ్డి, వరంగల్ రీజియన్ ఎస్ఈ ఎస్.సంపత్ కుమార్, మహబూబాబాద్ ఈఈ కె.సురేశ్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. పీఎంజీఎస్ వై కింద మన రాష్ట్రానికి 2,427 కిలో మీటర్ల రోడ్లు మంజూరైందని తెలిపారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా చేపట్టే ఈ రోడ్ల పనులకు సంబందించి పక్కాగా ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శాసనసభ్యుల సూచనలతో ఈ ప్రతిపాదనలను పూర్తి చేయాలని మంత్రి చెప్పారు.
పీఎంజీఎస్ వై మార్గదర్శకాలకు అనుగుణంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని రోడ్ల నిర్మాణ ప్రతిపాదనలు పూర్తి చేయాలని సూచించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రూ.20 కోట్ల చొప్పున ప్రతిపాదనలు రూపొందించాలని ఆదేశించారు. పీఎంజీఎస్ వై మూడు దశల కింద ఈ ప్రతిపాదనలు ఉండాలని… ప్రతి నియోజకవర్గానికి మొదటి దశలో రూ.8 కోట్లు, రెండో దశలో రూ.8 కోట్లు, మూడో దశలో రూ.4 కోట్లకు సరిపోయేలా రోడ్ల ప్రతిపాదనలు ఉండాలని చెప్పారు. పీఎంజీఎస్ వై మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల ప్రతిపాదనలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.
వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పూర్తి చేసి రాష్ట్ర కార్యాలయానికి నివేదిక సమర్పించాలని సూచించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ప్రతిపాదనల విషయంలో సమన్వయం , వీటిని రాష్ట్ర కార్యాలయానికి గడువులోపు అందజేసేలా వరంగల్ రీజియనల్ ఎస్ఈ కార్యాలయం ప్రత్యేకశ్రద్ధతో పని చేయాలని సూచించారు. రోడ్ల ప్రతిపాదనల రూపకల్పనలో మారుమూల గ్రామాలకు అత్యధిక ప్రాధాన్య ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంజనీర్లకు స్పష్టం చేశారు . అన్ని గ్రామాలకు ఆయా మండల కేంద్రం నుంచి తారు రోడ్డు ఉండేలా ప్రణాళిక ఉండాలని సూచించారు.
Minister Errabelli Dayakar Rao noted that the village roads also are not in good position and directed to the officials take up immediately Action..