సీఎం కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌తలు తెలిపిన మంత్రి ఎర్రబెల్లి..

299
errabelli
- Advertisement -

కొత్త‌గా నియామ‌క‌మైన పంచాయ‌తీ కార్య‌ద‌ర్శుల‌ వేత‌నాల‌ను, ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న కార్య‌ద‌ర్శుల వేత‌నాల‌కు స‌మానంగా పెంతున్న‌ట్లుగా అసెంబ్లీలో ప్ర‌క‌టించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు కృత‌జ్ఞ‌తలు, ధ‌న్య‌వాదాలు తెలిపారు రాష్ట్ర పంచాయ‌తీరాజ్ శాఖ‌ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు. దీంతో కొత్త‌గా నియామ‌క‌మైన 9వేల 355 మంది కార్య‌ద‌ర్శుల‌కు స‌మాన ప‌నికి స‌మాన వేత‌నంగా ఇప్పుడున్న జీతాల‌కు రెట్టింపు కంటే ఎక్కువ జీతాలు వ‌స్తాయ‌న్నారు. గ‌త కొంత కాలంగా కొత్త గ్రామ పంచాయ‌తీ కార్య‌ద‌ర్శులు కోరుతున్న డిమాండ్ సిఎం హామీతో నెర‌వేరింద‌న్నారు.

ప్రొబేష‌న‌రీ పీరియ‌డ్‌ను 4 ఏళ్ళ‌కు పెంచ‌డానికి గ‌ల కార‌ణాల‌ను కూడా సీఎం తెలిపారని, కార్య‌ద‌ర్శులు మ‌రింత రెట్టించిన ఉత్సాహంతో ప‌ని చేయాల‌ని మంత్రి కోరారు.‌ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మ విజ‌య‌వంతానికి గ్రామ కార్య‌ద‌ర్శుల ప‌నిత‌న‌మే కార‌ణ‌మ‌న్నారు. న‌ర్స‌రీలు, డంపు యార్డులు, ప‌ల్లె ప్ర‌కృతి వ‌నాలు, స్మ‌శాన వాటిక‌ల నిర్వ‌హ‌ణ‌ను ప‌క‌డ్బందీగా నిర్వ‌హించాల‌ని, నిరంత‌రం ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం కొన‌సాగుతున్నందున‌, పారిశుద్ధ్యం కూడా అలాగే జ‌ర‌గాల‌ని మంత్రి ఆదేశించారు.క‌రోనా మ‌రోసారి విజృంభిస్తున్న నేప‌థ్యంలో గ్రామ కార్య‌ద‌ర్శులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆదేశించారు.పారిశుద్ధ్యంలో రాజీ లేకుండా గ‌తంలో మాదిరిగానే, క‌రోనా క‌ట్ట‌డికి పూర్తి క్ర‌మ‌శిక్ష‌ణ‌తో ప‌ని చేయాల‌ని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.

- Advertisement -