సబ్బండ వర్గాల సంక్షేమ, అభివృద్ధి సమాహారంగా రాష్ట్ర బడ్జెట్ ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆంకాంక్షలను నేరవేర్చడమే లక్ష్యంగా 2020–21 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థాయి బడ్జెట్‌కు సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని ఆయన తెలిపారు. ప్రపంచాన్ని గడగడలాడించిన, ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన, కరోనా క్లిష్ట సమయంలోనూ, లాక్‌డౌన్ కారణంగా అడుగంటిన ఆర్థిక వ్యవస్థను అదిగమించి, సీఎం కేసీఆర్ అద్భుత ఆశాజనక, ప్రగతి కాముక బడ్జెట్‌ను రూపొందించారని ఆయన తెలిపారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతూ, సకల జనుల సంక్షేమం, అభివృద్ధిని వీడకుండా బడ్జెట్‌ను రూపొందించారన్నారు. సాగునీరు, వ్యవసాయం, విద్యుత్, విద్య, వైద్యం, మౌలిక రంగాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారని అన్నారు. దళితుల అభ్యున్నతికి రూ. వెయ్యి కోట్ల నిధులతో దళిత్ ఎంపవర్‌మెంట్ ప్రోగ్రామ్‌ను రూపొందించారన్నారు. ఎస్సిల ప్రత్యేక ప్రగతి నిది కోసం 21,306.85 కోట్లు, ఎస్టీల ప్రత్యేక ప్రగతి కోసం 12,304.23 కోట్లు, బీసీ సంక్షేమ శాఖకు 5,522 కోట్లు, మైనారిటీ సంక్షేమానికి 1606 కోట్లు, మహిళ,శిశు సంక్షేమం కోసం 1702 కోట్లు కేటాయించారన్నారు. జిల్లా కలెక్టరేట్లు, జిల్లా పోలీసు కార్యాలయాల కోసం 725కోట్లు కేటాయించారన్నారు. అలాగే, బీటీ సౌకర్యం లేని ఎస్టీ తండాలకు 165 కోట్లు, డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం 11వేల కోట్లు, చేనేత కార్మికుల కోసం 338కోట్లు, కళ్యాణ లక్ష్మీకి అదనంగా 500 కోట్లు ప్రతిపాదించడం పట్ల మంత్రి ఎర్రబెల్లి హర్షం వ్యక్తం చేశారు.
మరోవైపు తాను నిర్వహిస్తున్న, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మిషన్ భగీరథకు నిధులు కేటాయించినందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ బడ్జెట్‌లో గ్రామ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖకు 27వేల 271 కోట్లు, ఆసరా పెన్షన్ల కోసం 11వేల 728 కోట్లు, జిల్లా పరిషత్ లకు 252కోట్లు, మండల పరిషత్ లకు 248 కోట్లు, మొత్తం 500 కోట్లు విడుదల కేటాయించారన్నారు. అలాగే ఇప్పటికే ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు ప్రతి నెలా 308 కోట్లు ఇస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఇక వడ్డీలేని రుణాల కింద 3వేల కోట్లు కేటాయించారని, దీని ద్వారా రాష్ట్రంలోని 4 లక్షల 29వేల 262 మహిళా సంఘాలు, అందులోని 46లక్షల 65వేల 443 మంది మహిళలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి వివరించారు. మిషన్ భగీరథ కు సరిపడినన్ని నిధులు ఇవ్వడం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
వరంగల్ కార్పొరేషన్ కి నిధుల పట్ల ఎర్రబెల్లి హర్షం..
ఇక వరంగల్ కార్పొరేషన్ కి 250 కోట్లు కేటాయించడం పట్ల మంత్రి ఎర్రబెల్లి సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. గతంలో కంటే అధికంగా నిధులు రావడం వల్ల హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం వరంగల్ అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. వరదలకు దెబ్బ తిన్న రోడ్ల నిర్వహణ, మరమ్మతుల కోసం 11వందల కోట్లు ప్రతిపాదించడం వల్ల కూడా వరంగల్ కి ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ లో కురిసిన భారీ వర్షాలకు హైదరాబాద్ తోపాటు, వరంగల్ దెబ్బతిందని మంత్రి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ ప్రణాళికలు సమర్థంగా అమలు చేసే విధంగా వార్షిక ఆర్థిక ప్రణాళిక రూపొందించిన ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావులను ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించారు.