ఉమ్మడి వరంగల్ జిల్లాకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి, జిల్లా సమగ్ర అభివృద్దికి, సంక్షేమానికి వరాలను ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారికి రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు డాక్టర్ రాజయ్య, నన్నపునేని నరెందర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మేయర్ గుండు సుధారాణిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. వరంగల్ జిల్లాను విద్యా, వైద్య, ఐటి, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో మరింత అభివృద్ది చేసేందుకు సియం కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. ఏ జిల్లాకు ఇవ్వని ప్రాధాన్యత వరంగల్ కు ఇస్తున్నారని, అందుకు వరంగల్ ప్రజలు కేసిఆర్‌కు అండగా ఉన్నారని అన్నారు.
రెండు వందల ఎకరాలకు పైగా ఉన్న యంజియం, కేయంసి, ప్రాంతీయ కంటి ధవాఖాన, సెంట్రల్ జైలు స్థలంలో హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దడంతో పాటు, వెంటనే కేనడాలో ప్రభుత్వ ప్రతినిధి బృందం పర్యటించి, అంతకన్నా మెరుగైన వసతులతో సెంట్రల్ జైలు స్థలంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 33 అంతస్థులతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణాన్ని చేపట్టి ఏడాదిన్నరలో పూర్తి చేయాలని ఆదేశించడం వరంగల్ ప్రజలకు శుభ పరిణామమని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్‌ను మెడికల్ హబ్ గా చేయాలన్న ఆలోచనతో 1575 కోట్లు అంచనా వ్యయంతో మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు శ్రీకారం చుట్టారని, ఇది వరంగల్ ప్రజల అదృష్టమని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు. వరంగల్ జిల్లాకు సాగునీరు విషయంలో సీఎం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, దేవాదుల ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు కేటాయిస్తూ.. వంద కోట్లు కేటాయించి, ప్రతి చెరువు నింపాలన్న సియం నిర్ణయంతో ఉమ్మడి వరంగల్ జిల్లా సస్యశామలం అవుతుందన్నారు. సియం కేసిఆర్ గారికి ఉమ్మడి వరంగల్ జిల్లా రైతుల పక్షాన మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజాభిప్రాయం మేరకు వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ జిల్లాలకు హన్మకొండ, వరంగల్ గా నామకరణం చేయాలని నిర్ణయించడంతో పాటు, వరంగల్ నగరంలో ప్రభుత్వ దంత వైద్యశాల, డెంటల్ కళాశాల, వెటర్నరీ కళాశాలను మంజూరు చేయడం, మామునూరు విమానాశ్రయం త్వరలోనే రాబోతుందని ప్రకటించడంతో వరంగల్ జిల్లా మరింత అభివృద్ది చెందుతుందని ఎర్రబెల్లి అన్నారు.
విభజన హామీలను విస్మరించి తెలంగాణకు అన్యాయం చేస్తున్న చెత్తపార్టీ బీజేపీ అని, కేంద్ర ప్రభుత్వం చెత్త ప్రభుత్వమని విమర్శించారు. తెలంగాణను ప్రపంచం గర్వించే విధంగా అభివృద్ది చేస్తున్న ముఖ్యమంత్రి కేసిఆర్ గారిని అడ్డుకునేందుకు చిల్లర ప్రయత్నం చేస్తున్నారని, నాగార్జునసాగర్ అసెంబ్లీ, హైద్రాబాద్, వరంగల్, ఖమ్మం కార్పోరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల్లో ప్రగల్భాలు పలికిన బీజేపీ అడ్రస్ లేకుండా పోయిందన్నారు.