కరోనా బాధితుల‌కు అండగా ఉంటాం.. మంత్రి భరోసా..

51
Minister Errabelli Dayakar

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నియంత్రణకై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు చేస్తున్న కృషి వల్ల రాష్ట్రంలో ప్రస్తుతం రోజువారి పాజిటివ్ కేసులు క్రమక్రమంగా తగ్గుతున్నాయని, రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా అదుపులో ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటిసరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులతో ఆదివారంనాడు మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా కరోనా కట్టడి కోసం ఇంటింటికి జ్వర సర్వే నిర్వహిస్తూ, మెడికల్ కిట్లు అందించే కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నాయ‌ని ఆయన తెలిపారు.

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోని గ్రామాలలో పనిచేసే ఏఎన్ఎం, ఆశా వర్కర్ల వద్ద మెడికల్ కిట్లు అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. జ్వరం, ఒళ్ళు నొప్పులు లాంటి సమస్యలు ఉన్నవారు వెంటనే మెడికల్ కిట్లలోని మందులు వాడాలని, ఒకవేళ లక్షణాలు తగ్గనట్లయితే కోవిడ్ టెస్టు చేయించుకొని, పాజిటివ్ వచ్చినట్లయితే డాక్టర్ల పర్యవేక్షణలో హోమ్ ఐసులేషన్ లో ఉండి, వైద్య చికిత్స పొందాలని ఆయన సూచించారు. తీవ్ర‌ లక్షణాలు ఉన్న రోగులను వైద్య చికిత్స కోసం జనగామలోని ప్రభుత్వ ఆస్పత్రిలోగాని, వరంగల్ ఎం.జి.ఎం.లో గాని చేర్పించాలని ఆయన కోరారు. వరంగల్ ఎం.జి.ఎం., జనగామ ప్రధాన ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య చికిత్స అందించబడుతున్నదని, అందువల్ల సీరియస్ లక్షణాలు ఉన్న కరోనా రోగులను ఈ ఆసుపత్రుల్లో వైద్య చికిత్స కోసం చేర్పించాలని ఆయన కోరారు.

కేంద్ర ప్రభుత్వం సహకరించకున్ననూ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమం దృష్ట్యా 30 వేల కోట్ల రూపాయలు రుణం తీసుకొని, రాష్ట్రంలో వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ఆయన తెలిపారు. రైతులు పండించిన వరి ధాన్యాన్ని వారం రోజులలోగా కొనుగోలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. ప్రస్తుత వానాకాలంలో రైతుల పెట్టుబడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రైతు బంధు పధకం క్రింద జూన్ 15వ తేదీ నుండి ఆర్థిక సహాయ పంపిణీ ప్రారంభించి, 25వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆదేశించారని మంత్రి తెలిపారు.

కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుండటంతో ఆప్తులను, కార్యకర్తలను కోల్పోవడంతో హృదయం కన్నీటి సంద్రమవుతున్నదని మంత్రి అన్నారు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువకులు సైతం కరోనా తో మృత్యు వాతపడటం అత్యంత విషాదమన్నారు. కరోనా బారిన పడి ఇబ్బందులు పడుతున్న వారికి ప్రజాప్రతినిధులు అండగా నిలవాలన్నారు. బాధిత కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని కోరారు. నిత్యం అందుబాటులో ఉండి, కరోనా రోగులకు మనోధైర్యాన్ని కల్పించాలని కోరారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ, కరోనా నిబంధనలు పాటించాలని ఆయన కోరారు.