జనగాం జిల్లా దేవరుప్పుల మండల కేంద్రం ఎంపీడీవో కార్యాలయంలో ఆటో యూనియన్ డ్రైవర్లకు ఎర్రబెల్లి దయాకర్ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ మే 7 వరకు పొడగింపు చేశాం. ప్రతిఒక్కరూ తప్పకుండా సామాజిక దూరాన్ని పాటించాలి. కరోనా పరిస్థితుల నేపథ్యంలో గ్రామాలలో నిరుపేదలను ప్రజా ప్రతినిధులు ఆదుకోవాలని మంత్రి సూచించారు.
ఈ విపత్కార పరిస్థితుల్లో రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ధాన్యం, మక్కలకు రాష్ట్ర ప్రభుత్వం 30 వేళా కోట్లు ఖర్చు చేస్తుంది. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుతో ఈసారి పంటలు బాగా పండాయి. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తలేదు. కానీ తెలంగాణలో రైతులకు ఇబ్బంది కలుగొద్దు అని పండించిన పంటలను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. ఇందుకు టోకెన్ పద్దతిలో ధాన్యం కొనుగోలును నిర్వహించాలి అని మంత్రి పేర్కొన్నారు.