ఉద్యోగులకు 30శాతం ఫిట్ మెంట్ ఇచ్చి, 61 ఏండ్లకు ఉద్యోగ విరమణ వయసుని పెంచిన సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆదివారం అసెంబ్లీలోని సీఎం కేసీఆర్ చాంబర్‌లో ఆయనను కలిసి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఎర్రబెల్లితో పాటు రాష్ట్ర గిరిజన సంక్షేమం, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, నన్నపనేని నరేందర్ తదితరులు సీఎంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి సీఎంతో మాట్లాడుతూ, ఉద్యోగుల సమాజం మొత్తం సంతోషంగా ఉందన్నారు. వారు ఊహించిన దానికంటే ఎక్కువ ఫిట్ మెంట్ ఇచ్చారని తెలిపారు. ఉద్యోగ సమాజం మొత్తం సీఎంకు కృతజ్ఞతగా, రుణపడి ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ తన ధాతృత్వాన్ని చాటుకున్నారని, ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తున్న ఉద్యోగులందరికీ ఎన్నడూ మరచిపోని రీతిలో పిఆర్సీ ఇచ్చారని మంత్రి ఎర్రబెల్లి అన్నారు.