ప్రొఫెసర్ జి. మల్లేశం ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన మూడు సంఘాల నాయకులు మంత్రి సి. దామోదర్ రాజనర్సింహని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉద్యోగులు ఎన్నో సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న ముఖ్యమైన సమస్యలను మంత్రిగారి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రధానంగా, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉద్యోగులకు హెల్త్ కార్డుల మంజూరు అంశం, అలాగే దీర్ఘకాలంగా పరిష్కారం కాకుండా ఉన్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (CPS) సమస్యను సంఘాల ప్రతినిధులు విపులంగా వివరించారు. ఉద్యోగుల ఆరోగ్య భద్రత, పదవీ విరమణ అనంతర భవిష్యత్తు దృష్ట్యా ఈ రెండు అంశాలు అత్యంత కీలకమని వారు పేర్కొన్నారు.
ఈ విషయాలపై స్పందించిన మంత్రి దామోదర్ రాజనర్సింహ …ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉద్యోగులకు తప్పకుండా హెల్త్ కార్డులు మంజూరు చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. అదేవిధంగా, విశ్వవిద్యాలయానికి అత్యవసర అవసరాల దృష్ట్యా ఒక అంబులెన్స్‌ను మంజూరు చేస్తానని తెలిపారు. అంతేకాకుండా, ఉద్యోగుల కాంట్రిబ్యూటరీ పెన్షన్ సమస్య పరిష్కారం కోసం ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గారితో చర్చించి తగిన చర్యలు తీసుకుంటానని మంత్రి గారు భరోసా ఇచ్చారు.
ఈ ముఖ్యమైన భేటీకి కీలక పాత్ర పోషించిన ఆచార్యులు జి. మల్లేశం, సి.హెచ్. శ్రీనివాస్, సరస్వతమ్మ, చలామల వెంకటేశ్వర్లు కి ఎన్.జి.ఓ. స్టాఫ్ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్,ఎంప్లాయిస్ యూనియన్ సంఘాల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. వారి కృషి వల్లే ఉద్యోగుల సమస్యలు ఉన్నత స్థాయిలో చర్చకు వచ్చాయని సంఘాలు పేర్కొన్నాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడం పట్ల ఎన్.జి.ఓ. స్టాఫ్ అసోసియేషన్, టెక్నికల్ స్టాఫ్ అసోసియేషన్, ఎంప్లాయిస్ యూనియన్లు హర్షం వ్యక్తం చేశాయి. ఈ హామీలు త్వరలోనే కార్యరూపం దాల్చాలని ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Also Read:డకాయిట్ టీజర్‌తో అడవి శేష్ ఇంప్రెస్!

