రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ గనుల శాఖపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. గనుల శాఖలో సాంతికేక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. పర్యావరణ సమతుల్యత కోసం రాతి ఇసుక వినియోగాన్ని పెంచాలన్నారు. ఎక్కడా అక్రమ మైనింగ్ జరిగినా క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. అక్రమ మైనింగ్ ను సహించేది లేదని, ఎంతటి వారైనా ఒత్తిడికి గురికావద్దని మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గనుల పర్యవే..ణలో జియో ఫెన్సింగ్, జియో ట్యాగింగ్, ఉపగ్రహ చిత్రాల ఉపయోగం, డ్రోన్ల వినియోగాన్ని ఉపయోగించుకోవాలన్నారు. త్వరలో తీసుకురానున్న మైనింగ్ పాలసీలో దేశంలోని అత్యుత్తమ విధానాలను చేకూర్చాలన్నారు. ఈ పాలసీని చట్టరూపంలో తీసుకువస్తామన్నారు.
గత సంవత్సర కాలంలో గనుల శాఖలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్టు మంత్రికి అధికారులు తెలిపారు. అనంతరం నీటిపారుదల ప్రాజెక్టులు, ఆర్ అండ్ బీ నిర్మాణాల్లో రాతి ఇసుక వినియోగం పెంచాలని చెప్పారు. రాతి ఇసుక వినియోగం పెంచేందుకు ఆయా శాఖల ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం కావాలని ఆదేశించారు. టీఎస్‌ఎండీఎస్ ద్వారా కూడా రాతి ఇసుక క్రషర్‌ల ఏర్పాటును పరిశీలించాలని పేర్కొన్నారు.
పలు జిల్లాల్లో సత్ఫలితాలు ఇచ్చిన ఇసుక పన్ను విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని సూచించారు. బయ్యారం స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై త్వరలో కేంద్ర గనులు, ఉక్కుశాఖ మంత్రిని కలుస్తామని కేటీఆర్ తెలిపారు. బయ్యారంపై కేంద్రాన్ని ఎన్నిసార్లు కోరినా ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని మంత్రి గుర్తు చేశారు. గతేడాదిలో కార్యకలాపాలు నిర్వహించని 477 గనుల లీజును రద్దు చేశారు. ఈ సమావేశంలో గనుల శాఖ డైరెక్టర్ సుశీల్ కుమార్, టియస్ యండిసి మల్సూర్, గనుల శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.