క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 మరో నాలుగు రోజుల్లో, ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు పాల్గొనగా, వాటిని ఐదేసి చొప్పున నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రేమికుల్లో ఈ టోర్నీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
గ్రూప్–ఏలో భారత్, పాకిస్తాన్, అమెరికా, నెదర్లాండ్స్, నమీబియా జట్లు ఉన్నాయి. గ్రూప్–బిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, ఐర్లాండ్, జింబాబ్వే, ఒమన్ పోటీపడనున్నాయి. ఇక గ్రూప్–సిలో ఇంగ్లాండ్, వెస్టిండీస్, నేపాల్, ఇటలీ, స్కాట్లాండ్ ఉండగా, గ్రూప్–డిలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్తాన్, కెనడా, యూఏఈ జట్లు ఉన్నాయి.
ప్రతి గ్రూప్‌లోని జట్టు మిగిలిన నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. అనంతరం ప్రతి గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్–8కు అర్హత సాధిస్తాయి. సూపర్–8 దశలో ఐసీసీ సీడింగ్స్ ఆధారంగా ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజిస్తారు. అక్కడ కూడా ప్రతి జట్టు మూడు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత టాప్–2లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి.
టోర్నీ ప్రారంభానికి సమయం దగ్గరపడటంతో సెమీఫైనల్స్‌కు చేరే జట్లపై అంచనాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు మైఖేల్ వాన్ తన అంచనాను వెల్లడించాడు. ఇంగ్లాండ్, న్యూజిలాండ్, భారత్, ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌కు చేరుతాయని ఆయన జోస్యం చెప్పాడు. అయితే టీ20 ప్రపంచకప్ 2024లో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాను వాన్ తన జాబితాలో చోటు ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Also Read:శాశ్వత్ సచ్‌దేవ్..’ది ఇండియా హౌస్’

