అమెరికా తరహాలోనే మెక్సికో కూడా దిగుమతులపై కఠిన ఆర్థిక చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా, తమ దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) లేని దేశాలపై భారీ సుంకాలు విధించేందుకు మెక్సికో ముందుకు వస్తోంది. ఈ జాబితాలో భారత్‌తో పాటు పలు దక్షిణాసియా దేశాలు కూడా ఉండడం విశేషం.
మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ పార్డో సమర్పించిన కొత్త ప్రతిపాదనలకు అక్కడి సెనేట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సుమారు 1,400 రకాల దిగుమతి ఉత్పత్తులపై 50 శాతం వరకు కస్టమ్స్ సుంకాలు పెంచే అవకాశముంది. ఇందులో స్టీల్, కెమికల్స్, ఎలక్ట్రానిక్స్, ప్లాస్టిక్ గూడ్స్, మెషినరీ వంటి విభాగాలు ఉన్నట్టు అంతర్జాతీయ వర్గాలు సూచిస్తున్నాయి.
ఈ నిర్ణయం 2026 జనవరి 1 నుంచి అమల్లోకి రానుండగా, ప్రపంచ మార్కెట్లలో ఇప్పటికే చర్చలకు దారి తీసింది. అమెరికా మార్కెట్‌కు ప్రత్యామ్నాయంగా మెక్సికోను వినియోగించుకోవాలనుకునే భారత కంపెనీల ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు అంచనా వేస్తున్నారు. అలాగే మెక్సికోలో ఉత్పత్తులు అసెంబుల్ చేసి అమెరికాకు ఎగుమతి చేసే భారత వ్యాపారులకు కూడా ఈ కొత్త సుంకాలు అదనపు భారంగా మారే అవకాశం ఉంది.
అయితే, మెక్సికో తన దేశీయ పరిశ్రమలను రక్షించుకోవడమే లక్ష్యమని స్థానిక అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ వాణిజ్య సమీకరణల్లో ఇది కీలక పరిణామంగా భావిస్తున్నారు.
Also Read:AP:అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

