విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా మీరా కుమార్ పేరును విపక్షాలు ప్రకటించాయి. ఈ రోజు సాయంత్రం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ నివాసంలో విపక్షాల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అధికార ఎన్డీయే తరఫున భాజపా తమ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్‌ను ప్రకటించిన నేపథ్యంలో విపక్షాలు తొలిసారిగా భేటీ అయ్యాయి. అయితే, విపక్షాలు తమ అభ్యర్థిగా ఎవరిని బరిలో దించుతాయనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. విపక్షాల తరఫున అభ్యర్థులుగా లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, అంబేడ్కర్ మనవడు ప్రకాశ్ అంబేడ్కర్‌ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. వీటికి తెరదించుతూ మీరా కుమార్‌నే తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించాయి విపక్షాలు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ తో మీరాకుమార్ తలపడనున్నారు.
కాగా, లోక్ సభ స్పీకర్ గా, కేంద్రమంత్రిగా మీరా కుమార్ సేవలందించారు. ఆమె భారత ఉపప్రధానిగా పనిచేసిన బాబు జగ్జీవన్ రామ్ కూతురు. ఈ నెల 27న లేదా 28న ఆమె నామినేషన్ వేయనున్నారు. మీరాకుమార్ నామినేషన్ పై సంతకాల కార్యక్రమాన్ని విపక్షాలు ప్రారంభించాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్ యాదవ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే నేత కనిమొళి తదితరులు పాల్గొన్నారు.