17 ప్రతిపక్ష పార్టీల అండతో రాష్ట్రపతి రేసులో నిలిచిన మీరా కుమార్ మీడియాకు ఝలక్కిచ్చారు. గెలుపునకు అవసరమైన సభ్యుల మద్దతు లేని తాను పోటీ నుంచి తప్పుకోవాలా? అని ప్రశ్నించి ఉక్కిరిబిక్కిరి చేశారు.
రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థి మీరా కుమార్ నిన్న కర్ణాటకలో పర్యటించారు. బెంగళూరులోని కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) కార్యాలయంలో కాంగ్రెస్ నేతలు, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవగౌడలను కలిసిన మీరా కుమార్ వారి మద్దతు కోరారు. అనంతరం మీడియా ఇష్టాగోష్ఠిలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా.. బీజేపీ నిలబెట్టిన రామ్‌నాథ్ కోవింద్‌కు చాలా మంది సభ్యుల మద్దతు ఉందని, ఈ విషయం తెలిసీ మీరెందుకు పోటీలో నిల్చున్నారన్న మీడియా ప్రతినిధుల ప్రశ్నకు మీరా కుమార్ స్పందిస్తూ.. “ఇదే ప్రశ్నను నన్ను ప్రతి చోటా అడుగుతున్నారు.
అసలు ఇప్పటికే విజేత ఎవరో తేలిపోతే కనుక, ఇక ఎన్నిక ఎందుకు నిర్వహిస్తున్నారో చెప్పండి?” అంటూ ఆమె ఎదురు ప్రశ్నించారు. అనంతరం ఆమె తన ప్రసంగాన్ని కొనసాగించారు. తన ఎన్నికల ప్రచారం సబర్మతి ఆశ్రమం నుంచి ప్రారంభమైందని, గాంధీ సిద్ధాంతాలను, ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు.
‘నాకు సరిపడా మద్దతు లేదన్న ఒకే ఒక్క కారణంతో బరి నుంచి తప్పుకోమంటారా? నేను ఎన్నికల్లో పోటీ చేయడం మీకు ఇష్టం లేదా?’ అంటూ ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ తనను బలిపశువును చేసిందన్న వ్యాఖ్యలను కొట్టి పడేసిన మీరా, రాష్ట్రపతి ఎన్నిక ఇద్దరు దళితుల మధ్య పోరుగా మారిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది చాలా విచారకరమని, చదువుకున్న వారు కూడా రాష్ట్రపతి ఎన్నికలకు కులం రంగు పులమడం బాధాకరమని అన్నారు.